చౌద్వీఁ క చాంద్ హో - ఇందుబిమ్బమండునా

 

చౌద్వీఁ క చాంద్ హో

https://ajaraamarasukthi.blogspot.com/2025/09/blog-post.html

చౌద్వీఁ క చాంద్ హొ అన్న ఈ పాట లొ సూర్య చంద్రులు వున్నారు. అంటే వారున్నంతకాలము ఈ పాట భూతలము పై వుండితీరుతుంది. ఈ పాట 'చౌద్వీఁ క చాంద్' సినిమా లొనిదే. దీనిని నిర్మించిన వ్యక్తి గురు దత్. ఆ కాలములో ఆయన పేరు వినని వారు ఆయన సినిమాలు చూడనివారు వుండరు. ఆయన అసలు పేరు తెలిసినవారు అరుదు. ఆయన అసలు పేరు వసంతకుమార్ శివశంకర్ పదుకొనే . (9 జులై 1925 - 10 అక్టోబర్ 1964 ) 1950-60 దశకములలో చలనచిత్ర కళాఖండములను నిర్మించిన వారిలో అగ్రగణ్యుడు. ఆయన నిర్మించిన ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఆణిముత్యము. ప్యాసా, కాగజ్ కె ఫూల్, సాహబ్ బీబీ ఔర్ ఘులాం, చౌద్వీఁ క చాంద్  మకుటాయమానములు.  ఇందులో కాగజ్ కె ఫూల్ పూర్తిగా మట్టి కరచిన చిత్రము. కానీ గొప్పదనమేమిటంటే 'ప్యాసా' 'కాగజ్ కె ఫూల్' సినిమాలు greatest films of all time, గా Time magazine's "All-TIME" 100 best movies లో చేరినాయి.  Sight & Sound critics' and directors' poll, లో ప్రపంచములోని అతి గొప్ప దర్శకులలో గురుదత్ స్థానము సంపాదించినాడు.  ఆయనను గూర్చి తెలిసినవారు ఆతనిని "India'sOrson Welles" అంటారు. CNN వారి సర్వేక్షణములో ఈయన దేశములోని అత్యుత్తమ మైన 25 మంది నటులలో ఒకనిగా ఎన్నికయినాడు.

 

కాగజ్ కె ఫూల్ సినిమా వరకు ఈయన తీసిన సినిమాలకు S.D. బర్మన్ (R.D. బర్మన్ తండ్రి) సంగీత దర్శకుడు. కాగజ్ కె ఫూల్ సినిమా తీయవద్దని గురుదత్ కు ఆయన ఎంత చెప్పినా లాభము లేకపోయినది. ఆ సినిమా తరువాత గురుదత్ సినిమాలకు సంగీత దర్శకత్వము వహించనని ఖరాఖండిగా చెప్పివేసినాడు, ఆయన. ఆయన చెప్పినట్లే చిత్రము fail అగుట యే కాక దాదాపు దివాలా తీసినంతపని ఐనది గురుదత్ కు. కానీ ఆ సినిమా అతనికి ఎనలేని ప్రపంచ ఖ్యాతి తెచ్చిపెట్టింది. తరువాత సినిమానే మన చౌద్వీఁ క చాంద్.

 

దీని దర్శకత్వ భారమును మొహమ్మద్ సాదిక్ అన్న దర్శకునికి ఒప్పజెప్పినాడు కానీ గురుదత్ బాణీ మనకు ఆ చిత్రములో అణువణువునా కనిపించుతుంది. సంగీత దర్శకుడు ఈ సినిమాకు 'రవి.' పాటను వ్రాసినది షకీల్ బదాయుని గారు. ఈయన పేరుమోసిన ఫారసి, అరబ్బీ, ఉర్దూ , హిందీ కవి. ఈపాటలోని వాణీ బాణీ నీవా నేనా అన్నట్లు వుంటాయి. అందుకే ఈ పాట ఆచంద్రతారార్కము నిలిచేదయ్యింది.

 

బాణీ ఇస్తే పాట వ్రాయుట ఈ కాలము  మన సినిమా కవులకు కష్టమైనది కాదు. ఆ కాలములో కూడా అందమైన హిందీ బాణీలకు పాటలు వ్రాసినవారున్నారు . కానీ భావము భాష  బాణీకి అనుసంధించుట అంత సులభమైన విషయము కాదని నా ఉద్దేశ్యము. అందులోనూ ఈ పాటలో ఫార్సీ అరబ్బీ పదాలు ఉర్దూ తో చేరియున్నాయి. అందువల్ల యధాతతముగా ఆంధ్రీకరించుట నా శక్తికి అంత సులభమైన విషయము కాదు. అయినా ఆశ చెడ్డది. అందుకే ప్రయత్నిచినాను. చిత్తగించండి.

 

హిందీ పాట హిందీ లోనే ఇవ్వటము జరిగింది. ఈ పాటను  అమరముచేసినది అమరగాయకుడు మహమ్మద్ రఫీ గారే.  క్రింద నేను వ్రాసిన తెనుగు పాట పొందుపరచినాను. చిత్తగించండి.

चौदहवीं का चाँद हो या अफताब हो..

जो भी हो तुम खुद की कसम लाजवाब हो..

चौदहवीं का चाँद हो..

 

जुल्फ़ें हैं जैसे कांधों पे बादल झुके हुए,

आँखें हैं जैसे मय के प्याले भरे हुए,

मस्ती हैं जिसमे प्यार की तुम वो शराब हो..

चौदहवीं का चाँद हो..

 

चेहरा है जैसे झील में हँसता हुआ कँवल,

या जिंदगी के साज़ पे छेड़ी हुई गज़ल,

जाने बहार तुम किसी शायर का ख़्वाब हो..

चौदहवीं का चाँद हो..

 

होंठों पर खेलती हैं तब्बसुम की बिजलियाँ,

सजदे तुम्हारी राह में करती हैं कहकशां,

दुनिया--हुस्नों इश्क़ का तुम्ही शबाब हो...

चौदहवीं का चाँद हो.. 

 

ఇందుబింబ మందునా

ఇనబింబమందునా 

ఆ దైవ సాక్షిగా నీసరి లేరు ఎందునా

 

భుజకోటి నీరదాలు విరిసె  నీలాల కురులుగా 

నయనాలు దోచె నా మదికి  మధు పాత్ర దోయిగా

ఆనంద ప్రణయ వాహిని నీవందు చషకమే |           

||ఇందుబింబ మందునా ||

 

ఆ మోము హ్రదమునందున హసియించు జలజమో

జీవితపు వీణ తారలపై నర్తించు గీతమో

జీవన వసంతమా నీవే కవుల కల్పనో |                   

||ఇందుబింబ మందునా ||

 

ఆడేను నీదు వాతెరపై చిరునవ్వు మెరుపులే

నీ దారి మోకరిల్లెనులె ఆ పాలపుంతలే

ఈ ప్రణయ మోహ ధాత్రి దీప్తివి నీవె జవ్వనీ |          

||ఇందుబింబ మందునా ||

 

 

Comments

Popular posts from this blog

శంబూకుడు

గౌతమ మహర్షి - అహల్యాదేవి

కాశికా విశ్వేశ్వర లింగము