విష్ణు సహస్రనామము  

యుధిష్ఠిరుని ప్రశ్నలు - భీష్మాచార్యుని సమాధానములు

https://ajaraamarasukthi.blogspot.com/2025/08/blog-post.html

ఇది నాపాలి భగీరథ ప్రయత్నము. భగీరథుడు గంగను భూమిపైకి తెచ్చి తన పూర్వులకు స్వర్గప్రాప్తి కలిగించ గలిగినాడు. మరి నేను నా ప్రయత్నమును ఎంతవరకూ సఫలము చేసి ,'విష్ణు సహస్రనామము' యొక్క జద్గురువు శంకరుల వారి భాష్య సహకారముతో పూర్తిచేసి మీ ముందు ఉంచగలనో లేదో తెలియదు. ఏది ఎట్లయినా విత్తనమే వేయకుండా చెట్టు ఫలాలను పదిమందికీ పంచాదలచుట మూర్ఖత్వమౌతుంది. అందుకే రోజు ఉపోద్ఘాతముతో శుభారంభామును చేయుచున్నాను. సాధ్యమైనంత వరకూ ప్రతి శనివారమూ మీమున్డుంచే ప్రయత్నమూ చేస్తాను.

కార్యమును నేను యుధిష్ఠిరుని ప్రశ్నలు భీష్మ పితామహుని జవాబులతో ప్రారంభించుతాను.ఈపని పూర్తియగుతకే కొన్ని వారాలు పడుతుంది. విఘ్న వినాశకునికి నమస్కరించి ప్రారంభించుచున్నాను.

యుధిష్ఠిర ఉవాచ

కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం |

స్తువంత: కం కం అర్చంత: ప్రాప్ను యుర్మానవా శుభం ||

 

కోధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మత: |

కిం జపన్యుచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్ ||

తాత్పర్యం : (శంకర సంస్కృత భాష్యమును సులభ గ్రాహ్యముగా చేసి మీ ముందు ఉంచుచున్నాను.)

1. కీమేకం దైవతం లొకే  అనగా ఈ లోకములో ఒకేఒక దేవుడు ఎవరు? ఇంకా చెప్పవలసి వస్తే సకల వేద శాస్త్రాలలో ఏ  పరమాత్మను గూర్చి చెప్పబడినది? 2. కిం వాప్యే కం పరాయణం, ఈ సకల వేదశాస్త్ర జ్ఞానసారములో పరం+అయనం చెరదగిన పరం అనగా అత్యుత్తమమైన స్థానము, కిం అనగా ఏది? అనగా ఎవరిని ఆశ్రయించితే ఏవిధమైన భయము బాధ ఉండదో అది (అన్వయము) . అనగా ఆ పరబ్రహ్మాను గూర్చి ఎవరైతే తెలుసుకొంటాడో స్వతహాగా అతనే పరబ్రహ్మమే అవుతాడు. 3.స్తువంతః  కం ప్రాప్నియుః మానవాః శుభం అనగా ఎవరిని స్తోత్రము చేస్తే మానవులు శుభమును పొందుతారు?  4.  కం అర్చంతః    ప్రాప్న్యుః మానవాః  శుభం  అనగా ఎవరిని మనసా వాచా కర్మణః అర్చించుటచేత మానవులు శుభమును పొందగలుగుతారు? 5.కో ధర్మః సర్వ ధర్మాణాం అనగా మొత్తము అన్నీ ధర్మములలో అత్యుత్తమము అత్యున్నతము అయిన ధర్మము 'భవతః పరమవమాతః' అనగా మీ దృష్టిలో అత్యనా ఉత్కృష్ట మయినది ఏది?    6. కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్' అనగా ఏది జపించుటకు యోగ్యమైనదో దానిని సకల ప్రాణులు జన్మ సంసార బంధములనుంది విముక్తి పొందగలరు?.

 

భీష్ముడు ఆరింటికీ సమాధానము చెబుతాడు కానీ ధర్మజుడు అడిగిన క్రమములో కాదు. ఒకపరి పరిశీలించుదాము .  ఆయన మొదట

6వ ప్రశ్న కు సమాధానమును ఇస్తూ ఉన్నాడు.

జవాబు: జగత్ ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమమ్ ll

స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోథ్థితఃll

జగత్ ప్రభువు, దేవదేవుడు, అనంతుడు పురుషోత్తముడు యగు శ్రీ మహావిష్ణువు యొక్క వెయ్యి పేర్లను స్మరించువాడు కలకాలమూ వృద్ధి లోనికి వస్తాడు.

భీష్మ ఉవాచ, బీష్ముడు అన్నమాటకు భగవత్పాదులు ఈ విధముగా నిర్వచించుచున్నారు. సర్వేషాం బహిః అంతః శత్రూణాం భయ హేతుః , అంటే కామ క్రోధ మద మోహ లోభ  మాత్సర్యములగు అంతఃశత్రువులను జయించినవాడును బాహ్య శత్రువులు వారెవరైననూ సరే వారికి భీతి గొల్పువాడు కావున ఆయన    భీష్ముడు.

మరి భీష్మ ఉవాచ  అని ఉన్నది కదా! ఉవాచ అంటే బోధించుచున్నాడు అని కదా అర్థము. మరి ప్రవక్తకు మాత్రమే కదా అందుకు అర్హత ఉండేది. ఆయన మోక్ష ధర్మము మొదలగు అన్నిటినీ తెలిసినవాడు కావుననే ఆయన  ప్రవక్త. జంగమ స్థావరాత్మకమైనది జగము.దానికి ఆయన ప్రభువు. అంటే ఆయన ప్రభుతకు లోబడని జీవాజీవ పదార్థమే లేదు. అసలాయన సమస్త విశ్వమునకే ప్రభువు. బ్రహ్మ విష్ణు మహేశ్వరేంద్రాదులకు  అతీతమైనవాడు దేవదేవుడు. ఇక అనంతుడు అంటే

దేశతః కాలతః వస్తుతశ్చ అపరిచ్ఛిన్నం. అంటే, దేశతః  అపరిచ్ఛిన్నం, అది  ఎంత పెద్ద పొడవెడల్పు వైశాల్యము కలిగిన  ప్రాంతామయినా కూడా అది పరిచ్ఛిన్నమే! అట్టి పరిచ్ఛిన్నమే లేనియెడల అది అపరిచ్ఛిన్నమౌతుంది (అపరిచ్ఛిన్నం=De-limitation). కాలము విషయములో కూడా అది ఆవిచ్ఛిన్నమే! ఆదేవిధముగా కాలానికి ఆయన అపరి చ్ఛి న్నుడే! అదేవిధముగా

బ్రహ్మణ్యం సర్వ ధర్మజ్ఞం:

బ్రహ్మణ్యం సర్వ ధర్మజ్ఞం లోకానాం కీర్తి వర్ధనం ।

లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం॥ 13

 బ్రహ్మణ్యం:బ్రహ్మణే హితం బ్రహ్మణ్యం, స్రష్ట్వే

 బ్రహ్మణే హితం అనగా సృష్టికర్త యగు బ్రహ్మను కాపాడవలసిన బాధ్యత కూడా విష్ణువుదే! కారణము ఆయన సృష్టిభర్త కూడా కదా!బ్రాహ్మణాయ హితం అని కూడా అన్వయిన్చుకోవచ్చును. అంటే చతుర్వేద పారీణత గల్గి పురాణ శాస్త్ర ఉపనిషదాది సకల ధార్మిక వాఙ్మయమును ధరించిన బ్రాహ్మణ రక్షకుడు అని మరొక అన్వయము. తపస్సు చేయువారలను అనగా తాపసులను రక్షించువాడు, శృతయే అనగా వేదపరిరక్షకుడు,

మిగిలినది మరోమారు.......


 

విష్ణు సహస్రనామము-2వ భాగము

యుధిష్ఠిరుని ప్రశ్నలు - భీష్మాచార్యుని సమాధానములు

 

వేదపఠనానురక్తులకు రక్షకుడు, ఇన్ని అర్థములున్నవి బ్రహ్మణ్యం అన్నపదానికి. ఇంతటి వ్యాఖ్యానము చేయగల ఏకైక వ్యక్తి శంకరులు మాత్రమే!ఇక సర్వ ధర్మజ్ఞం అంటే సర్వాన్ ధర్మాన్ జానాతి - సర్వధర్మజ్ఞః అనగా ఆయనకు తెలియని ధర్మమే లేదు. ఈ విషయమై భవద్గీత వ్యాఖ్యానము వ్రాయుసమయమున ఉపోద్ఘాతములో కొంత విస్తారముగా చెబుతారు శంకరులవారు. ధర్మము అన్న ఒక మార్గమును సృష్టించించిన పరమాత్మ దానిని రెండుగా విభజించినాడు. 1. ప్రవృత్తి ధర్మము 2. నివృత్తి ధర్మము. సనకాది నారడాది మహర్షులకు భగవంతుని హృదయము నందు ఉంచుకొని రమించుట తప్ప అన్య చింతన లేనివారు. మరీచ్యాది మహార్షులు ప్రవృత్తి ధర్మమును పాటించిన వారు.ప్రవృత్తి అంటే కర్మ భక్తి సమాధులు.నివృత్తి అంటే కేవలం జ్ఞానం.

వేదాంత విజ్ఞాన రంగంలో భగవద్గీత కున్న ప్రచారం మరి దేనికీ లేదు. అన్నీ తెలిసిన పండితుల దగ్గరి నుంచీ ఏమీ తెలియని పామరుల దాకా దాని నభిమానించే వారే, ఆబాల గోపాల మందరికీ అది శిరోధార్యమే. మహాభారతంలో ఇది గాక ఇంకా ఎన్నో ఉన్నాయి గీతలు. హంస గీత- బుభు గీత-బ్రాహ్మణ గీత- అనుగీత- ఒకటేమిటి- చాలా ఉన్నాయి. వాటికి తోడు సనత్సుజాతీయ మోక్ష ధర్మాల లాంటి ఘట్టాలు కూడా ఏమంత తక్కువవి కావు. అయినా దీనికి వచ్చిన ప్రఖ్యాతి వాటికి రాలేదు.

ఏమి కారణం. సకల వేదార్ధ సార సంగ్రహ మది. వేదంలో చెప్పిన ప్రవృత్తి నివృత్తి ధర్మాలు రెండూ చోటు చేసుకొన్నాయందులో. ప్రవృత్తి అంటే కర్మ భక్తి సమాధులు. నివృత్తి అంటే కేవలం జ్ఞానం. భగవద్గీతలో నాలుగూ కనిపిస్తాయి మనకు. అంతవరకేగాదు _నాలుగింటినీ _సమన్వయించటంలో ఉంది దాని గొప్పతనం. అది ఎలా గని అడగవచ్చు. పేరుకు పద్దెనిమిది అధ్యాయాలని విభజించినా అన్ని అధ్యాయాలలో చెప్పిందీ నాలుగే యోగాలు. ఈ నాలుగూ మరలా రెండే. “లోకేస్మిన్‌ద్వివిధా నిష్టా పురా ప్రోక్తామయార్జున” అని స్వయంగా చెప్పుకొన్నాడు కృష్ణ భగవానుడు. ఈ లోకానికి  రెండే రెండు యోగాలు బోధించాడటతాను. అవి ఒకటి జ్ఞానం. _ మరొకటి యోగం. యోగ మంటే కర్మ అని అర్ధం. అప్పటికి జ్ఞానము- ఆ - కర్మా - ఇవి రెండే భగవాను డుపదేశించింది. ఇవి రెండూ కూడా ఇంకా కొంత లోతుకు దిగి చూస్తే మరలా ఒక్కటే: దీనికి కూడా భగవానుడి ఆమోద ముద్ర ఉంది. ఏకమ్ సాంఖ్యంచ యోగంచ యః పశ్యతి సపశ్యతి. జ్ఞాన కర్మలూ రెండూ నిజాని కొక్కటే - అవి రెండూ ఒక్కటేనని గ్రహించిన వాడే ధన్యుడని చాటుతాడు. ఇలాంటి సమన్వయం భగవద్గీతలో తప్ప మరెక్కడా కనిపించదు మనకు.

అంతే కాదు. ఇలాంటి సమన్వయ జ్ఞానంతోపాటు విజ్ఞానాన్ని కూడా ప్రసాదించటం గీతలోని మరొక విశిష్టత. జ్ఞానం వేరు. విజ్ఞానం వేరు. విజ్ఞానమంటే శాస్త్ర జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోటం.. “జ్ఞానం తేహమ్‌సవిజ్ఞానమ్‌- జ్ఞానవిజ్ఞాన నహితమ్‌” అని అక్కడక్కడా భగవానుడు సెలవిచ్చిన మాటలలో అంతరార్థ మిదే. ప్రస్థానత్రయంలో అసలు నిదిధ్యాసనకు ప్రాధాన్యమిచ్చేది భగవద్గీత. నిదిధ్యాసనమంటే అనుభవమే. అనుభవమనేది ఎప్పుడూ ప్రత్యక్షమేగాని పరోక్షం గాదు. మిగతా ప్రాపంచిక పదార్థాల లాగా బ్రహ్మభావం కూడా మానవుడికి ప్రత్యక్షంగానే అనుభవానికి వస్తుందనీ - అది సాధించే మార్గం కూడా అతి సులభమనీ - చాటించే ధైర్య మొక్కగీతకే చెల్లు, ప్రత్యక్షావ గమమ్ ధర్మమ్ - సుసుఖమ్‌కర్తు మవ్యయమ్‌” అని గీత ఇచ్చిన హామీ. ఇదే తదుపదేశ లక్ష్యం కూడా.

అయితే ఇది ఇంత బహిరంగ సత్యమై - అందుకొనుట ఇంత సులభమైతే ప్రతివారి అనుభవానికీ రావాలిగదా - ఎందుకు రావటంలేదని ప్రశ్న వస్తుంది. దానికి కారణం మానవ మనోదర్చణానికి పట్టిన మాలిన్యమే. కాబట్టి దానిని శుద్ది చేసుకోటానికి మొదట కర్మయోగమూ - శుద్ది అయిన తరువాత ఏకాగ్రత కోసం సమాధియోగమూ- ఆ తరువాత ఒక ఆలంబన కోసంగా భక్తియోగమూ - అలవరచుకోవాలనీ - ఆ పిమ్మట వా వాటన్నిటి ఫలితంగా ఆత్మజ్ఞాన ముదయిస్తే - అది చివరకు విజ్ఞానరూపమైన అనుభవంగా మారుతుందనీ - ఒక చక్కని భూమికాక్రమాన్ని నిర్దేశిస్తుంది గీత! దీనితో పరస్పరం విరుద్ధంగా కనిపించే సాధన మార్గాలన్నీ ఏకరూపంగా మారి అంతా బ్రహ్మాత్మానుభవంలో పర్యవసానం చెందుతాయి. దీనిస బట్టి లోకంలో ఎవరి అంతస్తుకు తగినట్టు వారు తమ కనువైన మార్గాన్ని అనుసరిస్తూ పోవచ్చు. ఒక్కసారిగా అందరూ జ్ఞానాన్ని అందుకోలేరు. మానవులలో ఉత్తములుంటారు, మధ్యములుంటారు. మందు లుంటారు. అతి మందు లుంటారు. అందరినీ దృష్టిలో పెట్టుకొనే గీత అందరికీ అన్ని మార్గాలు బోధించిందీ. అవే కర్మ భక్తి సమాధి యోగాలు. భగవానుడే అంటాడొకచోట, యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్l

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ।। 4-11 ।।

మిగిలినది మరోమారు..............

3వ భాగము

ఎవరే మార్గాన్ని అనుసరించినా మొత్తాని కందరూ నా మార్గంలో ఉన్నవారేనని 'చాటుతాడు. అయితే ఒక పెద్ద హెచ్చరిక ఏమంటే ఇవన్నీ సాధకుల సౌకర్యం కోసం చెప్పినవే. గాని సాక్షాత్తుగా ప్రతి ఒక్కటీ ఇందులో మోక్షపదవికి తీసుకు పోతుందని భ్రాంతి పడరాదు. సాక్షా న్మోక్ష ప్రదాయక మొక్క జ్ఞానమే. అది వెంటనే లభించక పోతే దానికివి పరోక్ష సాధనాలు. జ్ఞానముదయిస్తే ఇక వీటి కస్తిత్వం లేదు. సర్వమ్ ‌కార్మఖిలమ్ ‌పార్థజ్ఞానే పరిసమాప్యతే, సర్వయోగాలూ జ్ఞాన యోగంలో పరిసమాప్తం కావలసిందే నంటుంది గీత.

ఇలాంటి సకలజన హితైషిణి అయినది భగవద్గీత. ఇంత శాస్త్రార్ధ సంప్రదాయాలతో కూడింది గనుకనే దాన్ని శాస్త్రంగానే మనం భావించాలని బోధిస్తారు శంకర భగవత్పాదులు. ఆయన అలాగే దర్శించి వ్యాఖ్యానించినారు దాన్ని. అది అతి లోకమైన అత్యద్భుతమైన అత్యున్నతమైన వ్యాఖ్య.

పార్ధాయ ప్రతి బోధితాం భగవతా నారాయణేన స్వయం

వ్యాసేన గ్రథితాం పురాణ మునినా మధ్యే మహాభారతమ్l

అద్వైతామృత వర్షిణీం భగవతీ మష్టాదశాధ్యాయినీ

మంబ! త్వా మనుసందధామి భగవద్గీతే! భవద్వేషిణీమ్‌ll

భగవద్గీతపైన, భగవంతునిపైన ఆ నమ్మకము పెట్టి అనుష్ఠించితే అద్వైతానుభూతికి అంకితము కాగలము. అందరినీ కాపాడే ఆ పరమాత్మ మనలోనే ఉన్నాడు. అది తెలుసుకొంటే ఆయనే మనమైపోతాము.

ఇక 'లోకానాం కీర్తి వర్ధనం' అన్న మాటను ఎ విధముగా విమర్శించినారో గమనించండి:

లోకానాం అంటే ప్రాణులకు, జీవులకు అని అన్వయించుకొనవలెను. లోకములకు అని కాదు. మనము చేసే దైవానుసంధాన ధర్మానుసంధాన కార్యములకు కీర్తిని కలిగించుటయేగాక దానిని వృద్ధిచేస్తాడు.అట్లని మనము చేసే అధర్మ కార్యములను గూర్చి పట్టించుకోడని కాదు.అందుకు తగిన అపకీర్తిని మనకు మూటకట్టి ఇస్తాడు. శృతి మించితే హిరణ్యాక్ష హిరణ్యకశిపాదులను, రావణ కుంభకర్ణాదులను, శిశుపాల దంతవక్త్రాది రాక్షసులను, రాక్షసగుణ

 సంపన్నులైన మానవులను కూడా తమహడ్డు మీరిన వెంటనే సంహరించుతాడు.

ఇక లోకనాథం అంటే 'లోకైః నాథః' లోకానికి  అనగా లోకాలను భరించువాడు. 'భర్త' అన్న మాటకు భరించువాడు అన్నది ప్రసిద్ధార్థము. ఈ 'లోకనాథం' ఇంకా అర్థాలు ఏమున్నాయో చూద్దాము.

'లోకానాం నాచ్యతే' అంటే లోకులచేత యాచించుకొనబడుతాడు. ఇది శంకరులవారు చెప్పిన అన్వయమునకు పెద్దల వివరణ. అమితమైన ఆశపోతు సర్వలోకాదిపత్యమే అడుగవచ్చు. అడిగించుకొనుటలో ఏమయినా అడిగించుకొంటాడు. ఇచ్చేది మాత్రము అడిగినవాని కర్మానుసారమే! మరియొక అర్థమును చూద్దాము. 'లోకాన్ ఉపతపతి' అనగా ఆయనను చేరేవరకూ తన భక్తులను తపింపజేస్తూ ఉంటాడు.'ఆశాస్తే' అనగా ఆయన ఫలదాత. 'లోకానాం ఈశ్తే'అనగా                                                                                                  ఆయన నియంత్రించువాడు (Controller).

ఇక ‘మహద్భూతం’ అన్నది ఒక పదము కాదు. ఇందులో .మహాత్. మరియు .భూతం. అన్న రెండు పదాలు ఉన్నాయి. మొదట 'మహాత్' అన్న మాటకు అర్థాన్ని చూద్దాము. ‘మహాత్ అనగా  విశ్వవ్యాపి అని అర్థము. ఆ లక్షణము కలిగినది పరబ్రహ్మమే! ;విశ్వోత్కర్షేణ వర్తమానస్వాత్ వ్విశము యొక్కరూపమును ధరించి సమస్త వస్తు జీవజాలములను భరించి ఉత్కృష్టుడగుటచే  ఆయన ‘మహత్ అనబడినాడు. ‘భూతం అనగా ‘పరమార్థ సత్యం’. ఈ సత్యం అన్నపదమునకు మూడు అర్థములు మనకు అగుపించుచున్నాయి. 1. ప్రాతిభాషిక సత్యము 2. వ్యావహారిక సత్యము 3. పారమార్థిక సత్యము. ప్రాతిభాషిక సత్యము అంటే ఆసమయానికి అది మనకు సత్యముగా తోచుతూ ఉంటుంది. ఉదాహరణమునకు మనము స్వప్నావస్థలో చూచేది ఏదయినా అప్పటికి వాస్తవముగానే అనుకొంటూఉంటాము. మరొక ఉదాహరణ మెలుకువలో ఉన్నపుడు ఒక వ్యక్తి తాను దర్శించిన ప్రదేశమును గూర్చి తానూ గొప్పవాడని అనుకొనుటకు ఏవేవో ఏర్చి కూర్చి పేర్చి చెబుతూవుంటాడు. మానమా ప్రదేశమును చూచేవరకు క్=ఆటను చెప్పేదంతా వాస్తవమనే నమ్ముతాము. ఉడే ప్రాతిభాషిక సత్యము. ఇక వ్యావహారిక సత్యమును గూర్చి మాట్లాడుకొందాము.

మిగిలినది 4వ భాగములో.......

4వ భాగము

మిగిలినది 4వ భాగములో.......

4వ భాగము

ఏదయితే మనము మెలుకువలో చూసినది నిజమని నమ్ముచున్నామో అది వ్యావహారిక సత్యము. అది తరువాతి కాలములో సత్యము కాకపోవచ్చును. ఇక మూడవది  పారమార్థిక సత్యము. ఈ జగత్తే లయమైన తరువాత కూడా ఏదయితే నిలుస్తూ ఉన్నదో అది  పారమార్థిక సత్యము. ఇది త్రికాల అబాదిత సత్యము. సర్వకాల సర్వావస్థలయందును ఏదయితే స్థిరముగా ఉన్నదో ఆ పరమార్థ సత్యమును ఈ ‘భూతం అన్న పాదములో సూచించుట జరుగుచున్నది. ‘సర్వభూత భవోద్భావం అంటే ‘సర్వ భూతానాం భవః సంసారః. ‘యత్ ప్రకాశాత్ ఉద్భవతి. సమస్త జీవులయొక్క పుట్టుక లేక ఈ సంసారము ఎవనియోక్క సమీపము వలన ప్రకాశమానమగుచున్నదో ఆయన, మనము ఆశ్రయిన్చాదగిన వ్యక్తి అని అన్వయము. ఇప్పుడు మనము 5వ ప్రశ్నకు పోవుచున్నాము. 5వ ప్రశ్న ఏమిటంటే

‘కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః ।

కిం జపన్ముచ్యతే జంతుర్జన్మసంసార బంధనాత్ll

జవాబు ఈవిధముగా చెబుతున్నారు భీష్ములవారు.

ఏష మే సర్వ ధర్మాణాం ధర్మోఽధిక తమోమతః ।

యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా ॥

ధర్మము అన్నమాటకు మీమాంసా శాస్త్రము ఈవిధముగా తెలుపుతుంది: ‘చోదనాలక్షణార్థో ధర్మఃఒక పనిని చేయుటకు ఏదయితే  ‘చోదన’ అనగా ప్రేరేపణ చేయుచున్నదో అది ధర్మము. సర్వేషాం చోదనా లక్షణానాం ధర్మః సమస్తమైన ప్రేరేపణ చేయు ధర్మములను ఆచరింపజేయు లక్షణములు కలిగినది ధర్మము. అన్నింటికన్నా అత్యున్నతమైనది అని నాఅభిప్రాయము అని అంటున్నారు భీష్ములవారు. ‘ఎవనియందు, ఎవరైతే అత్యున్నతమైన ఆధిక్యత కలిగిన భక్తి తత్పరత నుంచవలెనో అట్టి, తామరరేకులవంటి కన్నులు కలిగిన ఆ పుండరీకాక్షుని స్తవము అనగా (మనఃపూర్వకముగా) స్తుతించుతూ ఉండుట  అత్యున్నతమైనది అని నా అభిప్రాయము’ అని భీష్మాచార్యులు అంటున్నారు.

ఆయన ఎక్కడున్నాడు అంటే హృదయ పుండరీకములో ఉన్నాడు. ఇదేమాట మంత్రపుష్పములో మనకు ఈ విధముగా వినిపిస్తుంది: ‘పద్మకోశః ప్రదీకాశం హృదయంచాప్యధోముఖం.....నీలతోయద మధ్యస్థ ద్విజ్జుల్లెఖే వభాస్వరాః, నీవార శూక మత్తన్వి పీతాభా స్వస్త్యణూపమా, తస్యాZ శిఖాయై మధ్యే పరమాZఆత్మా వ్యవస్థితః’ తలక్రిందుచెప్పుచున్నది.లుగా ఉన్న పద్మపు మొగ్గవలె మనగుండె నాభికి జానెడుపైన నిష్ఠికి జానెడు కింద గుండె ఉన్నదని మనకు మంత్రపుష్పము నిర్దుష్ఠముగా చెప్పుచున్నది.దానికి చెంతనే వడ్ల గింజ అంతటి నీలి వర్ణపు జ్వాల శిఖలో అణురూపములో పరమాత్మ వెలసియున్నాడు’ అని చెప్పుచుచప్పుచున్నారు. న్నది. అంటే మన నడవడిక లోని ధూర్తత ఆ పరమాత్మునికి అప్పటికప్పుడే తెలియవస్తూ ఉన్నది. ఆయన సర్వవ్యాపి కావున విష్ణువు. అట్టి సర్వాంతర్యామి స్తవమును ఎల్లకాలమూ చేయమని వచిన్చుచున్నాడు భీష్మపితామహుడు.

శంకరాచార్యులవారు తమ విష్ణు సహస్రనామ భాష్యములో ఇంకా ఈ విధముగా తెలియజేయుచున్నారు. ఈ స్తోత్రము హింసా విదూరమైనది, స్తుతించేవ్యక్తి తప్ప ఇతరుల అవసరము ఉండదు. అంటే యజ్ఞ యాగాది క్రతువులలో చేయు జంతుబలి ధర్మబద్ధమైనా ఇక్కడ అనపెక్షిత్వమే! అంటే అవసరము లేనిదే! అదేవిధముగా ఈ స్తోత్రము పురుషాంతర అనపెక్షిత్వము కలిగియుంటుంది. యజ్ఞయాగాడులలో వాలే ఇక్కడ అన్యుల సహకారము అవసరముండదు. అదేవిధముగా ఇది ద్రవ్య అనపెక్షిత్వమును కూడా కలిగియుంటుంది. అంటే డబ్బులు పెట్టి కొని దేవునికి సమర్పించనవసరము లేదు. ఇంకా ఇది దేశకాలనియమాది అనపేక్షిత్వము కూడా కలిగియుంటుంది.

ఈ ప్రతిపాదనను పుష్టీకరణము చేస్తూ ఆదిశంకరులవారు ఇంకా ఈ విధముగా పురాణ. స్మృతి, భారత ఇతిహాస, భగవద్గీతలనుండి ఈ స్తోత్ర ప్రాధాన్యతను ఉగ్గడించు శ్లోకములను  మనముందు ఉంచుచున్నారు:

ఈ స్తోత్ర పారాయణమునకు చిత్తశుద్ధి ఒక్కటి చాలు. ఇది ప్రతి స్తావకుడు అనగా స్తుతించువాడూ గుర్తుంచుకొనవలసిన విషయము.

ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞైః త్రేతాయాం ద్వాపరే 'ర్చయన్l

యధాప్నోతి తథాప్నోతి కలౌ సంకీర్త్య కేశవంll (విష్ణు పురాణాంతర్గతము)

మిగిలినది 5వ భాగములో.......

5వ భాగము

కృతయుగములో తపస్సాధన చేతనూ, ద్వాపరమున యజ్ఞయాగాదులచేతనూ, ద్వాపరమున అర్చించుట చేతనూ, కలియుగమున కేవలము సంకీర్తన అనగా నామజపము చేతనూ ఆ కేశవుని సన్నిధి పొందవచ్చును. ఆ మాటనే అన్నమయ్య ఈ విధముగా చెబుతాడు “కందువగు హీనాదికములిండు లేవు, అందరికి శ్రీహరే అంతరాత్మ” అని. అంటే నామ సంకీర్తనకు బ్రాహ్మణ శూద్ర తారతంయములేదు. చిత్తశుద్ధితో జపయజ్ఞము చేసే ఆరతిఒక్కడూ బ్రాహ్మణుడే! ఆ వాస్తవము చెప్పుటకు ఆదిశంకరులవారు మనుస్మృతిని ఉదహరించుచున్నారు.

జప్యే నైవతు సంసిధ్యే బ్రాహ్మణో నాత్ర సంశయఃl

కుర్యాదన్యన్ నవాన్ కుర్యాన్  మైత్రో బ్రాహ్మణ ఉచ్యతేll (మనుస్మృతి)

జపము అనగా నామ సంకీర్తన చేసే ప్రతిఒక్కడూ బ్రహ్మబుడే! ఇందు సంశయము లేదు. వేరేమయినా చేసినా చేయకున్నా అతను (పరమాత్మునికి) మిత్రునిగా చెప్పబడుతాడు. ఈ జపమే సర్వశ్రేష్ఠమని వ్యాసభారత శ్లోకను ఉటంకించుచున్నారు ఆదిశంకరులవారు.

జపస్తు సర్వధర్మేభ్యః పరమో ధర్మ ఉచ్యతేl

అహింసయాచ భూతానాం జపయజ్ఞ ప్రవర్తతేll (వ్యాస భారతము)

అన్నింటికన్నా పరమోత్కృష్టమైనది నామజపమే! ఇందులో హింస అన్న ప్రస్తాపనే లేదు. అందుకే జపయజ్ఞము సులభము సుగమము. ఇపుడు ఈ మాటను స్వయముగా ప్రమాత్మాయే గీత 10వ అధ్యాయములో తెలియజేసిన శ్లోకమును తెలియజేయుచున్నారు స్వ్హన్కరులవారు.

మహార్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరమ్ ।

యజ్ఞానాం జపయజ్ఞోఽస్మి స్థావరాణాం హిమాలయః ।। భ.గీ.10-25।।

మహర్షులలో భృగు మహర్షిని నేను మరియు శబ్దములలో ఎకాక్షరమగు 'ఓం' కారమును. యజ్ఞములలోజపయజ్ఞము నేను.  అంటే భగవన్నామసంకీర్తనమే నేను; స్థావరములలో హిమాలయమును నేను. అంటే ఇక్కడకూడా జపయజ్ఞము సర్వోత్కృష్టమైనది. ఇందు జంతుబలీలేదు. పురోహితుని సహకారము అవసరము లేదు. మానస నివేదనము తప్ప అన్యానివేదనము అవసరము లేదు.

మిగిలినది 6వ భాగములో........


Comments

Popular posts from this blog

హిరణ్య వర్ణా (సూర్య స్తుతి)

విద్యారణ్యులు - విజయనగరము

గౌతమ మహర్షి - అహల్యాదేవి