శంబూకుడు
శంబూకుడు
Published on 02/09/2015 13:38
https://ajaraamarasukthi.blogspot.com/2024/10/blog-post_29.html
నారాయణ లోని రెండవ అక్షరము 'రా' పంచాక్షరి యైన నమశ్నిశివాయ లోని రెండవ అక్షరము 'మ'. ఈ రెండుఅక్షరముల సమన్వయమే 'రామ' శబ్దము. 'రా' లేకపోతె 'నారాయణ' 'న+అయన' అవుతుంది. అంటే పురోహమించనిది. మరి కదలిక లేనిది శవ
సమానమే కదా! అదేవిధముగా 'నమశ్శివాయ' లో 'మా' లేకుంటే 'న శివాయ; అవుతుంది, అంటే సకల సౌభాగ్యమునకు ప్రతీకయన శివము 'న' అంటే ఉండదు అని అర్థము. కావున 'రామ శబ్దమే మంగళమయ పురోగతికి చిహ్నము. 'రామ నామమే అంత గొప్పది.
ఇక ఈ విషయమును గమనించండి:
రామో విగ్రహవాన్ ధర్మః' అని శత్రువగు మారీచునిచే పొగడబడినవాడు, అంటే శ్రీరాముడు ఎంతటి ధర్మ మార్గ పథికుడో మనకు తెలియ
వస్తుంది.
ఇంకొక మాట గమనించండి:
ఇంద్రజిత్తును వధించుటకు ఈ దిగువ మంత్రము చదివి
లక్ష్మణుడు బాణము వేసి నిహతుని జేసినాడు.
'ధర్మాత్మా సత్య సంధశ్చ రామో
దాశారధీర్యది l
పౌరుషేచ అప్రతిద్వన్దః శారైనంజహి రావణింll
అంటే శ్రీరాముడు ధర్మాత్ముదయితే, సత్యసంధుడయితే,పౌరుశములో ఎదురులేనివాదయితే ఈ బాణము
మేఘనాథుని ప్రాణము తీయుగాక! అని ఆతని అసువులు బాపినాడు. ఈ మూడు కారణములు
శ్రీరమచంద్రుని దైవత్వమును ధర్మప్రాయనత్వమును తెలుపుచున్నాయి.
వాల్మీకి రామాయణము లోని బాలకాండ నాల్గవ సర్గలో మనము ఈ
క్రింది శ్లోకమును చూడవచ్చును.
చతుర్వింశత్సహస్రాణి శ్లోకనాముక్తవాన్ఋషిః ।
తథా సర్గశతాన్పంచ షట్కండాని తథోత్తరమ్ll
ఈ శ్లోకార్థము ఏమిటన
రామాయణాన్ని ఇరవై నాలుగు వేల శ్లోకాలలో ఆరు కాండలలో
మరియు ఐదు వందల అధ్యాయాలలో ఉత్తర కాండతో కలుపుకొని రచించినారు.
ఉత్తర కాండను రామాయణము యొక్క ప్రత్యేక కాండగా
పరిగణించినట్లయితే, కాండల సంఖ్య ఏడు, అధ్యాయాల సంఖ్య 649 మరియు శ్లోకాలు సంఖ్య 24,253.
అప్పుడే వాల్మీకి మహర్షి ప్రతి వెయ్యి శ్లోకాలకూ ఒక గాయత్రీ
మంత్రాక్షరమును ఉంచినట్లవుతుంది.అంటే ఉత్తరకాండ ప్రక్షిప్తము కాదని
తెలియవచ్చుచున్నది.
శత శ్లోకి రామాయణములోని మొదటి శ్లోకమును చివరి
శ్లోకమును ఈ క్రింద పొందుపరుస్తున్నాను చదవండి. దీనిని సంక్షేప రామాయణం అనటం కూడా
కద్దు.
తపస్వ్యాధ్యాయరతంతపస్వి వాగ్విదాం వరమ్l
నారదంపరిప్రచ్ఛశ్చ వాల్మీకిర్మునిపుంగవమ్I1
పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్
స్యాత్ క్షత్రియో భూమి పతిత్వమీయాత్l
వణిగ్జనస్య పుణ్యఫలత్వమీయాత్
జనశ్చ శూద్రోపి మహాత్వమీయాత్ll
గాయత్రీ మంత్రము 'తత్సవితుః' తో
మొదలయి 'ప్రచోదయాత్' తో అంతమగుచున్నది.
అంటే రామాయణము అనగా సీతారామ చరితము ఇంత పవిత్రమైనది. మరి అందలి కథానాయకుడు ధర్మ
మార్గమును ఏ పరిస్థితి లోనూ తప్పడు.
ఇక మెల్లమెల్లగా అసలువిషయానికి వద్దాము.
శంబూకుడు -2
ఉత్తర రామ చరిత్ర లోని శంబూకుని వృత్తాంతము అందరికీ
తెలిసినదే. అతను జన్మతః శూద్రుడు. తపోనిష్ఠతో స్వర్గము పోవలెనని అసలు అతని మాటలలో చెప్పవలసి వస్తే స్వర్గమును
జయించవలెనని తలుస్తాడు. అనుకొన్న విధముగానే తపస్సు తనను తలక్రిందులుగా చెట్దటునకు
వ్రేలాడదీసుకొని తలక్రింద జ్వాలాయమానమగు మంటను పెట్టి తపస్సుకు పూనుకొంటాడు,.
ఇంతలో ఒక బ్రాహ్మణుడు తన భార్యతో మరియు అకాలమరణమునకు ఆహుతియైన కుమారునితో
రాముని ఆశ్రయించుతాడు. ఆసమయమున రాముడు తన సభ జరుపుతూ ఉంటాడు. నిస్సహాయుడైన ఆ బ్రాహ్మణుని ఆత్మఘోషను అర్థము
చేసుకొని తన పాలనాలోపమును తెలుసుకొనుటకు మంత్రులతోనూ.ఋషులతోనూ వేద విదితులగు
బ్రాహ్మనులతోనూ తక్షణము ఒక ఆంతరంగిక సభనుఏర్పాటుచేస్తాడు.ఆయన సలాదారులలో వశిష్ఠ, వామదేవ, కాత్యాయన, మార్కండేయ,
మౌద్గల్య, గౌతమ, జాబాలి, కాశ్యప మహర్షులు అత్లుయంత
ప్రముఖులు.వీరందరితోబాటూఆసమయమునకు
దేవర్షి నారదుడు కూడా అక్కడికి వస్తాడు. అందరి సలహాలు
తీసుకొన్న రామునికి నారదుడు విశ్లేషించి వివరణాత్మకముగా యుగాధర్మమును గూర్చి
బోధించుతాడు. ఇంకా నారదుడు శ్రీరామునితో ‘రామా నీ రాజ్యములో ఎవరో ఒక ధర్మమూ తప్పి
చరించిన వ్యక్తీ వాళ్ళ ఈ జరుగాకూదనిది జరిగినది. అతనిని గుర్తించి ఆతను చేసిన
అకృత్యమునకు తగిన దండన విధించుము’ అని తెలియజేస్తాడు.
ఆలోచనలతో ఆలసింపక ఆ బ్రాహ్మణ బాలుని శవమును నూనె కాగులో సందిబంధాలు
విడిపోకుండా ఉండు లాగున పదిలపరుపమని లక్ష్మణునాజ్ఞాపించినాడు. ఆతరువాత పుష్పక
విమానమును కోరిన వరము ప్రకారము మనసున తలచుకొనగా ఆయనముందు ప్రత్యక్షమయిన ఆ
విమానమును అధిరోహించి పడమర ఉత్తర తూర్పు దిశలయందు ఎటువంటి అవాంతరములను గానక దక్షిణ
దిశకు చేరుకొన్నాడు రాముడు. అక్కడ ఒక దుర్గమ అటవీ ప్రాంతములో అధోముఖుడై
(తలక్రిందులుగా), తలకు ప్రజ్వలించిన అగ్ని బాధపెట్టుచుండగా కఠోర
తపంబాచారించు ఒక వ్యక్తిని గాంచి అచ్చట దిగినాడు శ్రీరామచంద్రుడు.
శ్రీరామ శంబూక సంవాదములో శంబూకుని ద్వారా గ్రహించిన
సమాచారము ఆధారముగా శ్రీరామచంద్రుడు శంబూకుని ఈ విధముగా ప్రశ్నించుతాడు: ‘నీవు
యోగము యొక్క అష్టాంగములలోని ‘యమ’ అను ఉపాంగముననుసరించి తపమాచారించుచున్నావు, ఇక్కడ యోగమును గూర్చి మనకు అవసరమైనంత
మేరకు తెలుసుకొందాము.
శంబూకుడు – 3
‘యోగము’ అంటే కలయిక అని అర్ధము. భారతీయ చింతన ప్రకారం
వ్యక్తికి, కుటుంబము, సమాజము వేరుకాదు. ఇది ఒక వలయము. పరమాత్ముడు ఈ
వృత్తమునకు కేంద్రము. అన్ని వ్యవస్థలు ఈకేంద్రీకృత వృత్తము లోని 'జ్య'లగా
పరిగణించవచ్చు.ఈ జ్యాలపై గల బిందువులు కేంద్రముతో సమన్వయింపబడి వుంటాయి. వ్యక్తి, కుటుంబం, సమాజం, దేశం, సృష్టి, పరమేష్టిల మధ్య సమన్వయానికి ఉద్దేశింపబదినదే 'యోగము'.
యోగమును అష్టాంగ యోగము అని అంటారు. ఈఅష్టాంగములుఏమిటివంటే 'యమ, నియమ, ఆసన,
ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి'అన్నవి. యోగాభ్యాసము చేయించే
యోగగురువులు'ఆసనము' నుండి యోగవిద్య ప్రారంభించుతారు. మొదటి రెండు సూత్రాలైన,
'యమ' 'నియమా'లు కేవలము కొద్దిపాటి సమయము కేటాయించే అంగములు కావు. ఇవి జీవితకాలమంతా
సాధన చేయవలసిన యోగ ప్రధానాంగములు. 'నియమము' వ్యక్తి సంస్కారములకు సంబంధించింది. అలా పొందిన
సంస్కారాన్ని సమాజం కోసం వెచ్చించడం ‘యమ’ సూత్రం మనకు ప్రబోధిస్తుంది. ఈ ‘యమ’ అను
అంగమును గూర్చి మనము విస్తారముగా భాగవతము నందు చదువగలము. నేను అతిముఖ్యమైన ఈ 'యమ' యొక్క ఉపాంగముల గూర్చి మన శీర్షిక పరముగా అవసరము
కాబట్టి ప్రస్తావించుతాను.
ఆంధ్రమహాభాగవతములోని ఏకాదశ స్కందములో 19వ సర్గలో 'యమ' మనము
విస్తారముగా చూడవచ్చు. ఈ ‘యమ’ఆచరణలో నేను మనకవసరమయిన గుణములను మాత్రము స్పృ
శించుతాను. మొదటిది ‘అసంశయం’ అనగా వ్యామోహము లేమి. ఇక్కడ శంబూకుడు కోరుకొనే
స్వర్గము ఒక కోరికయే కదా! ఇక రెండవది ‘ఆస్తిక్యం’ అనగా దేవునిపై నమ్మకము. ఆ నమ్మకమే ఉంటే తపస్వి స్వర్గ
సుఖములు కోరడు, భగవంతునికై తపస్సు చేసియుండెడివాడు..
మూడవది ‘పరార్థము’ అనగా సాటిమనిషికి సహకరించుట. ఈయన తపస్సులో స్వార్థము
తప్ప పరార్థము లేదు.
ఇంకాస్త లోతుకు వెళ్దాము. ఇందులో తలెత్తే సందేహమేమిటంటే శూద్రుడయినంత మాత్రాన
తపస్సు చేయ కూడదా! చేసినంత మాత్రాన నిర్దాక్షిణ్యముగా రాముడు శంబూకుని తన కరవాలము
చేత చంపవలెనా! అన్నది మనలోని అతిముఖ్య సందేహము.
నాది చాలా పరిమితమైన జ్ఞానము. అయినా ఈ విషయమై నాకు
తోచిన నాలుగు మాటలు వ్రాయుటకు సాహసించుచున్నాను. సాధారణముగా హైందవేతరులలో కొందరు, హేతువాదులు కొందరు, 'మను' దూషకులు కొందరు, వామ
పక్షీయులు కొందరు ఇటువంటి ధర్మ సూక్ష్మములోని
మర్మమెరుగక, లేక తెలిసి కూడా, అంతగా విషయ పరిజ్ఞానము లేని అమాయకపు హిందువులను
లక్ష్యము చేసుకొని మన ఇతిహాస పురాణములను తప్పు పడుతూ వుంటారు. నిజానికి ఆధ్యాత్మ
రామాయణము, గార్గ్య రామాయణము, ఆనంద రామాయణము, అగ్నిపురాణము , శ్రీమద్భాగవతము, పద్మపురాణము ఇంతెందుకు మహాకవి కాళీదాసు రఘువంశము
లోకూడా ఈ ఉదంతముల చూడవచ్చును. ఈ గ్రంధములన్నింటిలో ఈ ఉదంతమును ప్రక్షిప్తము
చేసినారని చెప్పవీలుకాదు. కారణము ప్రక్షిప్తములు జరిగినది అంతా తురుష్కుల మరియు
ఆంగ్లేయుల కాలములోనే! సద్విమర్శకులు ఎవ్వరూ మొత్తము ఉత్తరకాండ ప్రక్షిప్తమని
చెప్పలేదు. అందులో ఏవయినా వేరు విషములు జరిగియుంటే అవి అటువంటి సంఘటనలేవయినా
ఎదురయితే సమర్థవంతముగా ఎదిరించుటకు సులభమవుతుందన్న సదుద్దేశ్యముతో ఈ నాలుగు మాటలు
వ్రాస్తున్నాను.
ప్రతి యుగానికీ ఒక యుగధర్మముంటుంది. అంటే ఏ యుగపు ధర్మము ఆ యుగముదే.
విశ్లేషించే అన్య మతస్తులు గుర్తుంచుకొనవలసినదేమిటంటే వారి వారి మతములు
ఇంచుమించుగా 2000,1500 సంవత్సరముల నాటివి. కావున వారికి ఈ విషయమే అనుభవమునకు
వచ్చే అవకాశము లేదు. యుగము ధర్మములు అన్నవి కొంత విస్తారముగా తెలుసుకొనవలసిన
విషయములు. భగవద్గీత చదివితే ధర్మమునకు నిర్వచనము తెలుసుకొనవచ్చును. కృతయుగమున అనగా
సత్య యుగమున బ్రాహ్మణులకు మాత్రమే తపస్సు చేయుటకు అధికారము. త్రేతాయుగమున
క్షత్రియులకు కూడా ఆ అధికారమబ్బినది, అంతేకాకుండా వారికి బ్రాహ్మణులతో
సమానముగా యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించుటకు అధికారము ఇవ్వబడినది. ఈ యుగమున జనక
మహారాజు వంటివారు వేదాంత జ్ఞాన సంపన్నులుగా మసలినారు. తపస్సు చేయు అర్హత
క్షత్రియులకు ఈ యుగమున ఉండు కారణముచే, విశ్వామిత్రుడు
చెప్పలేనంత శ్రమ పడి బ్రహ్మర్షి అయినాడు. ద్వాపరము\ నందు బ్రహ్మ క్షత్రియ వైశ్యులకు
తపస్సుచేయు అధికారము ఇవ్వబడినది,. అదికాకుండా అర్చన ఈ యుగమున
ఒక విశిష్ఠ స్థానమును పొందినది, అర్చన తోనే భీష్మ,విదుర, సంజయ, ఉద్ధవ, అక్రూరాదులు పరమాత్మునికి ప్రీతి పాత్రులైనారు.
అదేకలియుగములోనామదేవుడు, జయదేవుదు,తుకారాం,
కుంభారుడు, అన్నమయ్య, త్యాగయ్య, శ్యామా శాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, ఆళ్వారులు, నాయనారులు, కుల ప్రసక్తి లేకుండా, కేవలము భక్తి సంకీర్తనలతోనే భగవంతుని బడసినారు. అంటే
యుగ యుగమునకూ ధర్మము మారుతూ వస్తూవుంది అనుటకు ఇది ఒక చక్కని ఉదాహరణ.
ఇక అసలు విషయానికొస్తే రాముని వనవాసమునకు హేతువైన దాసి మంధర శూద్ర
స్త్రీనే కదా! కోపావేశములో చంపుతానని భరతుడు ఆమె పైకి కత్తినెత్తినా ధర్మము కాదు
కాబట్టి భరతుడు ఆపని చేయకుండా విరమించుతాడు. ప్రేమతో శూద్ర స్త్రీ యగు శబరి ఇచ్చిన
ఎంగిలి పళ్ళను రాముడు తింటాడు. గుహుడు ఇవ్వదలచిన విందు వనవాస దీక్షలో వున్నందువల్ల
తిరస్కరించినా ఆయన చేత ఇవ్వబడిన ఫలములనాహారముగా గైకొంటాడు రాముడు. గుహుడు నదిని
దాటిన్చిచినందుకు సీతాదేవికి తన ముద్రికను గుహునకు బహుమతిగా ఇవ్వనని సీతాదేవికి
సైగచేసి ఇప్పిస్తాడు. శూద్రుడైన చాకలివాడన్న మాటకు కట్టుబడి ప్రాణ సమానురాలైన భార్యను
వదిలి పెడతాడు. ఈ పనులన్నీ ధర్మబద్ధమైనవే! అందుకే ఎటువంటి సంకోచములకు తావునివ్వక
ఆయా విధులను నిర్వర్తించుట జరిగినది. ఈ విషయములలో రాని సందేహము శంబూకుని
విషయములోనే ఎందుకు వచ్చినట్లు? ఎందుకంటే అతను ధర్మ విరుద్ధంగా ఉపనయనాది క్రతువులు, వేదాధ్యనము గురుముఖతః లేకుండానే స్వార్థ చింతనచే
తపస్సుకు గడంగినాడు. అందుకే యుగధర్మ విరుద్ధమగు తపంబునకు గడంగి శ్రీరాముని చేతిలో అసువులు బాసినాడు.
శంబూకుడు – 4
అతను తపోబలముతో స్వర్గము చేరవలెననుకొన్నాడు. అక్కడ
తప్పు జరిగిపోయింది. త్రేతాయుగ కాలములో దేవ మానవులకు సత్సంబంధాలుండేవి. దేవతలకు
బాసటగా దశరథుడు దానవులతో యుద్ధము చేయుట మనము రామాయణములో గమనించుతాము కదా! ఆ
కాలములో, దేవతలతో, రాజులకు, చక్రవర్తులకు ఋషులు ముఖ్యముగా నారదుడు
అనుసంధానకర్తలుగా ఉండేవారు. ఆ ప్రథ ద్వాపరము వరకు చెల్లినది. కలియుగమున అది
కరువైనది.
రాముడు శంబూకుని విషయములో స్వతంత్ర నిర్ణయము
తీసుకోకుండా నారదాది ఋషివరేణ్యుల నడిగియే నిర్ణయము తీసుకొన్నాడు. శూద్రుడు
తపస్సుద్వారా స్వర్గము రాకూడదు అన్నది దేవతల ధర్మము. దేవతలద్వారా శంబూకుని
వృత్తాంతము విన్న ఋషులు బాలుని అకాలమరణమునకు శంబూకుని తపస్సు కారణమనుటయేగాక అతని
శిరస్సు ఖండించవలసినదిగా చెబుతారు. అది దేవతల మాట కాబట్టి చక్రవర్తిగా సత్సంబంధాలు
నెలకొల్పియుంచుట ఒక కారణమైతే,ధర్మ విరోధులను శిక్షించవలసిన
బాధ్యతను రాజు స్వీకరించి తీరవలసినదే కావున రాముడు నిస్సంకోచముగా శంబూకుని
సంహరించుతాడు. ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవలసి వస్తుంది. రాముడు తాటక స్త్రీ
అయినాకూడా గురువైన విశ్వామిత్రుని ఆజ్ఞ మేరకు , ఆయన మాట జవదాటవద్దని చెప్పిన తండ్రి మాట మేరకు
చంపుతాడు. 'తల్లి దండ్రి గురువు దైవం' అంటారుకదా! ఏది చేసినా ధర్మబద్ధముగానే తప్పించి
అన్యధా ఉండదు శ్రీరాముని యొక్క చేత . మరి అందుకే కదా, రాముని విరోధియై కూడా మారీచుడు రావణునితో
"రామోవిగ్రహ వాన్ ధర్మః
సాధుస్సత్య పరాక్రమః"
రాజా సర్వస్యలోకస్య దేవానామితతాసతః|| అని చెబుతాడు.
ధర్మము యొక్క ప్రతి రూపమే శ్రీరాముడు. దేవతలకు
ఇంద్రుని వలె, సమస్త లోకాలకు రాముడే ప్రభువు అన్న కీర్తిని
పొందినాడు.
"ధర్మాదర్థః ప్రభవతీ ధర్మాత్
ప్రభవతీ సుఖమ్, ధర్మేణ లభతే సర్వం ధర్మసార మిదంజగత్" అనగా ధర్మము వలన అర్ధము, అర్ధము వలన సుఖము లభిస్తాయి. ఈ సమస్త జగత్తు ధర్మ
స్వరూపమే అని ఋషివాక్యం "ధరతి విశ్వం ధర్మః" ధరింపబడేది ధర్మం. ధర్మాన్ని మనం ధరిస్తే అది మనల్ని
రక్షిస్తుంది. "సత్య ధర్మాభిరక్తానాం నాస్తి మృత్యుకృతం భయం" సత్య
ధర్మాలను ఆచరించు వారిని మృత్యువు కూడా భయ పెట్టజాలదు. ఇటువంటి ధర్మాన్ని
అడుగడుగునా పాటించినవాడు శ్రీరామ చంద్రుడు. ఆయన ఆదర్శ పురుషుడు.
అందుకే ' అన్నదమ్ముల ఆదర్శమైన ఆలూమగల అన్యోన్యమైన, తండ్రి మాటను నిలుపుటకైన ధరలో నీవే దశరథరాం'అన్నారు. కాబట్టి గురువుల ఆజ్ఞ మేరకు
శంబూకుని సంహరించుటలో తప్పు లేదని మనకు తెలియవచ్చుచున్నది.
శంబూకుడు - 5 వేరొకమారు......
శంబూకుడు – 5
వాల్మీకి రామాయణం - ఉత్తరకాండ - శంబూక వధ
నేను వాల్మీకి రామాయణం, ఉత్తరకాండలో నాలుగు శ్లోకాలు మీ ముందు ఉంచుతున్నాను.
ఇది 73 సర్గ. ఘట్టం శంబూక వధ. శ్రీరాముడు, తపస్సుచేస్తున్నాడనే అభియోగం మీద
శంబూకుడనే శూద్రుని సంహరించినాడని సామాన్యంగా అందరూ అనుకునేది. ఆయన ధర్మమిదే అని
వర్ణవ్యవస్థ ఘాతుకాలు చూపించడంలో ఇది రామునిపై హేతువాదుల అభియోగము. అది తరువాత
చూద్దాము.
తతః కతిపయాహః సు వృద్ధో జనపదో ద్విజః
మృతం బాల ముపాదాయ రాజద్వార ముపాగమత్ |2|
కొన్ని దినముల తరువాత ఒక జనపదంలోని ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన
పిల్లవాని మృతదేహాన్ని తీసుకొని రాజ భవన ద్వారమునకు వచ్చెను.
రుదన్ బహువిధా వాచః స్నేహదుఃఖ సమన్వితా
అసకృత్ పుత్ర పుత్రేతి వాక్యమేతదువాచః |3|
హా పుత్రా! హా పుత్రా! అని బహువిధాల దుఃఖంతో రోదిస్తూ ఇలా
అనుచుండెను.
కింతుమే దుష్కృతం కర్మ పురాదేహాంతరే కృతం
యదహం పుత్రమేకం తు పశ్యామి నిధనం గతం |4|
నేను పూర్వజన్మలో ఏమి పాపం చేసినానో కాని, ఈ జన్మలో నా ఏకైక పుత్రుని మరణాన్ని చూస్తున్నాను.
అప్రాప్త యౌవనంబాలం పంచవర్ష సహస్రకం
అకాలే కాల మాపన్నం మమ దుఃఖాయ పుత్రకః |5|
నా పుత్రునికి ఇంకా యౌవనం కూడా రాలేదు. పంచ వర్ష సహస్రకం వయస్సు.
అకాల మృత్యువు వానిని కాల గతిలో కలిపింది. ఆ పిల్ల వాని వయస్సు 14 సంవత్సరాలు.
పంచ వర్ష సహస్రకం అంటే 14 సం. ఎలా అయినది?
3
వాల్మీకి రామాయణం, ఉత్తరకాండ - శంబూక వధ
రాముని ప్రతిస్పందన
ఈ విధముగా విలపుస్తున్న బ్రాహ్మణుని
వేదనను, శోకమును, పలుకులను శ్రీరాముడు విని వెంటనే తనమంత్రులతోనూ, పైన చెప్పిన విధముగా వశిష్ఠ, వామదేవాది పురోహితులతోనూ, తన తమ్ములతోనూ ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసినాడు.
మార్కండేయ, మౌద్గల్య, కశ్యప, గౌతమ, నారదాది బ్రహ్మర్షులుకూడా ఆ సభను అలంకరించినారు.
పరస్పర అభివాదాల తరువాత రాముడు బాలకుని అకాల మృత్యువును, బ్రాహ్మణుని అభియోగమును ప్రస్తావనకు తెచ్చినాడు.
నారదుని వచనములు
రాముని ప్రస్తావన విని ప్రప్రథమంగా
నారదుడు ఇలా అన్నాడు.
శ్రుణు రాజన్ యథా అకాలే ప్రాప్తో బాలస్య
సంక్షయః |
శ్రుత్వా కర్తవ్యతాం రాజన్ కురుష్వ రఘునందన ll
రాజా! బాలుని అకాలమృత్యువు కారణం విను.
విని నీ కర్తవ్యం నిర్వహించు. (74.8,74.9)
74వ సర్గ 9-33 వరకుగల 25 శ్లోకాలు నారదుని సుదీర్ఘ ప్రసంగమును వివరిస్తాయి.
పురా కృతయుగే రాజన్ బ్రాహ్మణావై తపస్వినః |9|
హే రాజా! పూర్వం కృతయుగంలో బ్రాహ్మణులే
తపస్సులు చేసేవారు.
అబ్రాహ్మణులు తపస్సులకు దూరంగా ఉండేవారు.
బ్రాహ్మణులు బ్రహ్మతేజస్సు తో ఉండేవారు. సత్య యుగంలో ఎవరికీ అకాల మృత్యువులు
ఉండేవికావు. అపుడు దీర్ఘాయువులుగా అందరూ జీవించేవారు. సత్యయుగము తరువాత త్రేతాయుగము
వచ్చినది. అప్పుడు మనువంశీయులైన మానవులు దృఢశరీరులై ఉంటారు. కృతయుగం గడచి
త్రేతాయుగం రాగానే బ్రాహ్మణులతో క్షత్రియులు సమాన స్థాయికి వచ్చినారు. కొంచెం
వెనుకనున్న క్షత్రియులు తపస్సుతో, పరాక్రమముతో బ్రాహ్మణులతో సమానమైనారు.
బ్రహ్మ క్షత్రంచ తత్సర్వం యత్పూర్వ మవరం చ
యత్l
యుగయోరుభయోరాసీత్ సమవీర్య సమన్వితంll |13|
ఆ కాలపు ప్రజలు సర్వసమ్మతితో చాతుర్వర్ణ్య
సమాజ విభజన నంగీకరించినారు.
అధర్మః పాదమేకం తు పాతయత్ పృథివీతలే |15| =
కృతయుగంతో పోలిస్తే ఒక పాదం అధర్మం భూమిలో
ప్రవేశించినది. దానితో ధర్మము యొక్క తేజస్సు కొంత మందగిస్తుంది.
సత్య యుగంలో అందరూ మాంసాహారమే (ఆమిషం)
భుజించేవారు. త్రేతా యుగానికి భూమిలో నిక్షిప్తమై కృషితో వెలికి వచ్చే ఆహారం
తీసుకుంటారు. అధర్మం యొక్క పాదాంశ వలన త్రేతాయుగములో సత్యయుగపు దీర్ఘాయువు తగ్గి
పరిమితమైన ఆయువు మానవులకు ప్రాప్తించింది. సత్యధర్మ పరాయణత్వము సిద్ధించడానికి
మనుష్యులు యజ్ఞముల వంటి శుభకార్యములు మొదలుపెట్టినారు.
త్రేతాయుగేచ వర్తంతే బ్రాహ్మణాః
క్షత్రియాశ్చ యేl
తపో2తప్యంత తే సర్వే శుశ్రూషా మపరేజనాః ll |20|
త్రేతాయుగంలో బ్రాహ్మణ క్షత్రియులు తపస్సు
చేయుదురు, అన్యులు వారికి సేవలు చేయుదురు. బ్రాహ్మణ క్షత్రియుల
సేవ మిగిలిన వారికి పరమ ధర్మము. సేవ అంటే కాళ్ళు వత్తడమో వళ్ళు పట్టడమో తల అంటడము
కాదు. పూజాదికములకు యజ్ఞ యాగాడులకు పరిసరముల పరిశుభ్రము చేయడము, యజ్ఞావాటికలు
నిర్మించడము, ఋత్విక్కులు చెప్పిఅవిధముగా ముగ్గులు
వేయడము, పశుపాలన ఇత్యాది అనేక విషయములకు వారు యజమానులు.
శంబూకుడు – 6
బ్రాహ్మణ క్షత్రియులలో అధర్మము పెరిగినపుడు ధర్మములో
ఇంకొక పాదము పతనమై ద్వాపర యుగము ఆరంభమవుతుంది. ఈ యుగములో వైశ్యులు కూడా తపస్సు
చేస్తారు. ఈ మూడు యుగాలలోకూడా శూద్రునికి తపస్సుచేసే అధికారములేదు. భవిష్యత్
కలియుగంలో శూద్రయోనిలో న్మించినవారుకూడా
ఘోర తపస్సులు చేస్తారు. పై మూడు యుగాలలోకూడా
శూద్రునికి తపస్సుచేసే అధికారములేదు కానీ భవిష్యత్ కలియుగంలో శూద్రయోనిలో
జన్మించినవారుకూడా ఘోర తపస్సులు చేస్తారు. 28-29 శ్లోకములలో నారదుడు ప్రస్తుత విషయానికి వస్తాడు.
అధర్మః పరమోరాజన్ ద్వాపరే శూద్రజన్మనః
సవైవిషయ పర్యంతే తవ రాజన్మహాతపః |28|
అద్య తప్యతి దుర్బుద్దిస్తేన బాలవధోహ్వయం
యోహ్యధర్మంకార్యం వా విషయే పార్థివస్య తు |29|
ద్వాపరంలో కూడా శూద్రుడు తపస్సుచేయడం పరమ
అధర్మం. కాని మీ రాజ్యములో ఇప్పుడు ఒక మహాతపస్వి దుర్బుద్ధితో తీవ్రమగు తపస్సు
చేయుచున్నాడు. ఈ అధర్మకార్యమువలననే ఈ విపత్తు, అమాయక బ్రాహ్మణ బాలకుని అకాల మృత్యువు సంభవించినది.
అకార్యం జరుగుతూవుంది కావుమనే ధర్మ గ్లాని
కలిగినది. రాజ్యంలో
క్షిప్రంచ నరకం యాతి స చ రాజా న సంశయః |30| ఆరాజ్యపు రాజు శీఘ్రమే నరకగామియగును
ధర్మ పూర్వకముగా పరిపాలన చేసే రాజుకు
తపస్సు, వేదాధ్యయనము వంటి సుకర్మల ఫలములో ఆరవ భాగము
లభిస్తుంది. అందుచేత రాజ్యపాలనముచేసే ప్రభువుకు కూడా ధర్మాన్ని నిలబెట్టే బాధ్యత
ఉన్నది. అందుచేత మీరాజ్యములో దుష్కర్మ జరుగుతున్నదేమో అన్వేషించండి.
దుష్కృతం యత్ర పశ్యేథాస్తత్ర యత్నం సమాచర
ఏవంచేద్ధర్మవృద్ధిశ్చ నృణాంచాయువివర్ధనం
భవిష్యతి నరశ్రేష్ఠ బాలస్యాస్యచ జీవితం |33|
ఎక్కడ అధర్మం మీరు చూస్తారో అక్కడ యత్న
పూర్వకంగా దానిని అరికట్టండి. దాని వలన ధర్మ వృద్ధి మనుష్యులకు ఆయుర్వృద్ధి
జరుగుతుంది. మరణించిన బాలుడు పునర్జీవితుడౌతాడు.
ఈ విషయంగా భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని ఒకసారి
గుర్తుచేసుకొందాము.
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।। 3-35 ।।
పర ధర్మాన్ని ఆచరినచ్దలచుతకన్నా కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, స్వధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ
పర ధర్మాన్ని అనుసరించుట ప్రమాదకరమైనది.
త్రేత, ద్వాపరములలో ఇతర మతములు లేవు.
వర్ణాశ్రమ ధర్మములు మాత్రము ఉండేవి. ఎవర్నపు ధర్మమూ ఆ వర్నానిదే, ఒకధర్మము వారు వేరొక ధర్మమును ఆచరిన్చారాడు. ఇది పరమాత్మ చెప్పినమాట.
దీనినే పరోక్షముగా నారదులవారు పైన తెలియజేసినారు.
శంబూకుడు-7 ఇంకోకమారు ......
శంబూకుడు – 7
వాల్మీకి రామాయణం, ఉత్తరకాండ - శంబూక వధ
రాముని మరో ప్రయాణం
నారదుని అమృతమయమైన వాక్యాలతో రాముని
ముఖంలో సంతోషం కనుపించింది. లక్ష్మణునితో ఇలా అన్నాడు. "వెంటనే ద్వారం
వద్దయున్న వృద్ధ బ్రాహ్మణునివద్దకు వెళ్ళి ఓదార్చి, ఉపశమనం కలిగించి బాలుని శవాన్ని తైలద్రోణిలో
భద్రపరచుము" అని లక్ష్మణునితో చెప్పి, రాముడు తానూ పొందిన వరమును గుర్తు
చేసుకొని పుష్పక విమానమును తలచుకోగానే, పుష్పక విమానము ఆయన సన్నిధిలో వచ్చి
నిలిచినది. మహర్షులకు ప్రణామముచేసి, భరత లక్ష్మణులకు నగర రక్షణ కార్యము అప్పగించి, విమానములో రాముడు బయలుదేరినాడు. ముందు పశ్చిమదిశలోని
జనపదాలన్నీ వెదికినాడు. తిరిగి ఉత్తర దిశలోని జనపదాలలో అన్వేషణ జరిపినాడు. పూర్వ
దిశను గాలించినాడు. తన రాజ్యంలో అధర్మ వర్తనాన్ని గుర్తించ లేక పోయాడు. ఆఖరు
ప్రయత్నంగా దక్షిణదిశను సర్వేక్షణ (survey) చేయడం మొదలు పెట్టినాడు.
దక్షిణ ప్రాంతంలో వింధ్యాచలానికి సమీపం
లోని శైవల పర్వత ఉత్తర పార్శ్వంలో ఒక పెద్ద తటాకము రామునికి కనిపించింది. అక్కడ
తలక్రిందులుగా వ్రేలాడుతూ తలకు అగ్నికీలలు తగిలి బాధించుచుండగా తపమాచరిస్తున్న ఒక తపస్వి రామునికి కనుపించినాడు.
ఈ విధముగా తపమాచారించువారిని వాలఖిల్యులు అంటారు.
రాఘవస్తముపాగమ్య తప్యంతం తపముత్తమం
ఉవాచ చ నృపో వాక్యం ధన్యస్త్వమసి సువ్రతః |75.15|
శ్రీరాముడు ఆయనను సమీపించి ఉత్తమైన
తపోవ్రతములో నున్న ఆతాపసితో ఇలా అన్నాడు. "సువ్రతా! నీవు ధన్యుడివి"
"దృఢ విక్రమముతో ప్రకాశించే ఓ
తపోవృద్ధుడా? నీవు ఏ జాతిలో జన్మించినావు? నేను కుతూహలముతో అడుగుతున్నాను. నేను దశరథ పుత్రుడనైన
రాముని. నీవు దుష్కరమైన ఈ తపస్సు ఏకారణముతో చేయుచున్నావు? స్వర్గాపేక్షతోనా లేక మరియే ఇతర వరముకోసమైనా
చేస్తున్నావావేరు ఏదైనా అభిలాషతోనా? నీవు బ్రాహ్మణుడివా? క్షత్రియుడివా? వైశ్యునివా? శూద్రునివా?
ఇత్యేవముక్తః స నరాధిపేన
అవాక్ శిరా దశరథాయ తస్మై
ఉవాచ జాతిం నృపపుంగవాయ
యత్కారణంచైవ తపః ప్రయత్నః |19|
ఈ విధముగా ప్రశ్నించిన శ్రీరామునితో, అథోముఖముగా ఉన్న ఆ తపస్వి తన జాతినీ, తప ప్రయత్నం కారణాన్ని తెలియ చేసినాడు.
మిగిలినది 8వ భాగములో......
శంబూకుడు – – 8
వాల్మీకి రామాయణం, ఉత్తరకాండ - శంబూక వధ
కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పేరు చెప్పగానే గుర్తుకు
వచ్చేది ఆయన రాసిన శంబూక వధ నాటకం. ధర్మావతారుడుగా పూజలందుకునే రాముడు మహా తపస్సు
చేస్తున్న శంబూకుడిని కేవలం శూద్రుడైన నేరానికి గాను నిస్సంకోచంగా వధించాడనటం ఈ
నాటకం ఇతివృత్తం.
ఆయన ఉత్తర రామాయణం చదివి ఆయనకు అర్థమైన దానిబట్టి ఈ నాటకం
వ్రాసియుంటారు. ఈ విధంగా ఈ ఉపాఖ్యానం రామాయణం మీద, హిందూమతం మీద అనేక వ్యాఖ్యానాలకు కారణమయినది. ఆ
విమర్శ నేటివరకు సజీవంగా ఉండటమేకాక బలం పుంజుకుని షెల్డన్ పొల్లాక్ వంటి హిందూమత
విద్వేషులకు ఆయుధంగా మారింది. ఈ ఆచార్యునికి ఇన్ ఫోసిస్ నేత నారాయణమూర్తి కుమారుడు
రోహన్ మూర్తి, హార్వర్డ్ లో కంప్యూటర్స్ లో గ్రాడ్యుయెషన్ చేసిన technocrat, 52 లక్షల అమెరికన్ డాలర్ల విరాళంతో భారతీయ సనాతన ధర్మ
గ్రంధాలకు నేటి భారతీయ ముందుతరాలకు వీలుగా అమెరికన్ ఇంగ్లీషులో అనువాదాలు
చేయించేందుకు నడుంకట్టుకున్నాడు. ఈ వ్యవస్థకు ముఖ్య సంపాదకుడు పొల్లక్. ఈ మధ్య
ఢిల్లీ జె.ఎన్.యు లో జరిగిన సంఘటనలపై పొల్లక్, ఛోంస్కీ ల వంటి అమెరికనుల వ్యాఖ్యలు చూస్తుంటే వారి
మనోగతం అర్థమౌతుంది. మనం వారిని ignore చెయడం వలన ప్రయోజనంలేదు. వారి వ్యాఖ్యలను అదే రకమైన
వాదనతో పూర్వ పక్షంచేయాలి. దానికి మనకు వాల్మీకి రామాయణం సంస్కృత మాతృకతో పూర్తి
పరిచయం ఉండాలి. అదే నేను శంబూకవధను ఎంచుకున్న కారణం.
ఆ పొల్లాక్ మహాశయుని భావాలు ఇలా ఉన్నాయి
• సంస్కృత గ్రంధాలన్నీ ఒక బ్రాహ్మణ క్షత్రియ వర్గం
సామాన్య ప్రజని నిర్దాక్షిణ్యంగా అణగదొక్కి వారికి చెందని ఒక భాషలో వారిని
అధోస్థితిలో ఉంచడానికి ఉద్దేశించినవి.
• సంస్కృతం ఎప్పుడూ మృతభాషే.. ఆ గ్రంధాలను తనవంటి
మధ్యవర్తి పండితుడు మాత్రమే చదివి ప్రజానీకానికి యదార్థం తెలియ చెప్పాలి. అది మన
దురదృష్టము.
• మహమ్మదీయుల పాలనలోనే సుమారు 12వ శతాబ్ది రాముని దేవునిగా ఆరాధించడం
మొదలైనది. అంతకుముందు రామాయణానికి, రామునికి ప్రాధాన్యత లేదు. తురకలను రాక్షసులుగా, సామాన్యులను అనాగరికులుగా వర్ణించే ప్రయత్నంలో భాగమే
రామాయణం ప్రాధాన్యత.
• మహాభారతం ప్రమాదకరమైన హింసా ప్రవృత్తికి దోహదం
చేస్తుంది. దేశంలో అంతర్యుద్ధాన్ని ధర్మ రక్షణగా ప్రచారంచేసింది.
• జర్మనీలో హిట్లర్ నాజీల యుగం ఆర్యుల దమన సంస్కృతినే
ఆధారంగా తీసుకొన్నది.
ఈ రాతలు మిషనరీ సంస్థలు ప్రచారంలో ఉపయోగిస్తాయి. ఇది హిందూ మతంపై
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న unholy crusade లో భాగము.
నేను ఇంకా వాల్మీకిని ఈ ఉత్తర కాండంలో యథాతథంగా అర్థంచేసుకునే
ప్రయత్నం లోనే ఉన్నాను. నేటివరకూ ఎందరో మాన్యులు అన్నిరకాల భావ ధారలతో ఆ
గ్రంథాన్ని అర్థమూ,అపార్థమూ చేసుకొనే ప్రయత్నం చేస్తునే
ఉన్నారు. అనువాదాలు, అనుకరణలు, వ్యాఖ్యానాలు వాదనని ప్రక్క దారిని పట్టిస్తాయి. మన
దృష్టిలో సృష్టిలో మానవుల ఉనికి ఎంత సత్యమో దేవతలదీ, అసురులదీ అంతే సత్యము. రాముని కేవలం ఒక సామాన్య
క్షత్రియ మహారాజుగా ఊహించుకుంటే, ఆయన అవతార తత్త్వాన్ని నిరాకరిస్తే వాదన ఒక రకం గా
ఉంటుంది. దివ్యత్వాన్ని అర్థంచేసుకుంటే వచ్చే జ్ఞానం ఇంకొక విధంగా ఉంటుంది. నిజమైన
ఇంటినీ, ఇంటి ఛాయాచిత్రాన్నీ, ఇంటి ప్లానుని చూసినంత తేడా ఉంటుంది. ఒకటి మాత్రం
నిజం. నేటికీ మన సమాజంపై రాముని ప్రభావం వర్ణనాతీతం. ఈ పునాదులను బలహీనం చేయడం
అన్య మతాల వారి నిరంతర విఫల ప్రయత్నం.
శంబూక వధ వెనుక ఉన్న దైవ రహస్యం ఏమిటి? సువ్రతుడై తపోదీక్షలో ఉన్న శంబూకుడికి రాముడు
శిరచ్ఛేదం ఎందుకు చేసినాడు? మహాకవి, రాముని ధర్మ రక్షణకు ఉదాహరణగా ఈ ఉపాఖ్యానం
ఎందుకు మనకందించవలసి వచ్చింది? ఇది అలోచించవలసిన విషయము.
మిగిలినది శంబూకుడు 9లో..........
శంబూకుడు – 9
1.
త్రేతాయుగంలో ధర్మము 3 పాదాలలో నడుస్తూ ఉంది కదా! అందుచేత శంబూకుడు
తపస్సుచేస్తే వచ్చిన ధర్మ భంగము ఏమున్నది?
2. శంబూకుడు ఎన్ని సంవత్సరాలు తపస్సుచేసినాడు? బ్రాహ్మణ బాలుని మృత్యువు ఎప్పుడు సంభవించింది?
3. రాముడు బాలుని మృత్యువును చర్చించుటకు ఏర్పాటు చేసిన
సభలో త్రిలోక సంచారియైన నారదుడు ఎందుకు ఉన్నాడు?
4. ఎవరూ తమ అభిప్రాయాలు చెప్పకుండా నారదుని ఉపన్యాసం
మాత్రమే ఎందుకు వాల్మీకి చిత్రించినాడు?
5. నారదుడు బ్రాహ్మణుడేనా? నారదుడు శంబూకుని శిరచ్ఛేదం చేయమని చెప్పలేదే?
6. ఒక మహారాజు శంబూకుడిది అధర్మ వర్తనమని శిరచ్ఛేదం
చేస్తే దేవతలు దేవ కార్యం అని కొనియాడి, పుష్పవృష్టి కురిపించ వలసిన అవసరం ఏమి వచ్చినది?
7. రాముని పూర్వీకుడైన త్రిశంకుడు సశరీరుడై స్వర్గానికి
వెళ్ళాలని కోరితే విశ్వామిత్రుడు తన తపస్సుధారపోసి కూడా ఆ పనిలో విఫలుడై
త్రిశంకునికి శాశ్వతముగా "త్రిశంకు స్వర్గం" మాత్రమే ఈయగలిగినాడు కదా?
8. భగవంతుడైన రాముడు తపశ్శాలియైన శంబూకునిపై నేరారోపణ
చేయలేదే? నారదుడు నిర్వర్తించిన దేవకార్యం ఏమిటి?
ఈ ప్రశ్నలు చాలా సామాన్యమైనవే. రామాయణంలో నారదుని పాత్ర ఎంత? ఇది అర్థమైతే అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకుతాయి.
గమనిక - నేను రామాయణం పై ప్రవచనం ఈయటంలేదు. ఒక సామాన్య పాఠకునిగా రామాయణం చదివి ఎలా
అర్థంచేసుకోవాలన్నదే నాప్రయత్నం. నేను చదువుతూ మీతో నా ఊహలు, అపోహలు పంచుకుంటున్నానని అర్థం. అందుచేత నేను
వ్రాసినదానితో చదివిన వారందరూ ఏకీభవిస్తారని నేను అనుకోవడంలేదు. నారదుని "ఆయన
బ్రాహ్మణుడా?" అని అన్న ప్రశ్నకు సాక్షాత్తూ బ్రహ్మ మానసపుత్రుడన్న జవాబు
చెప్పవలసి వస్తుంది. దాసీ పుత్రుడగు ఆ మహనీయుడు చాతుర్మాస దీక్షకు వచ్చిన
సాదుపున్గావులకు శుశ్రూష చేసి అష్టాక్షరిని వారిద్వారా ఉపదేశమును పొంది బ్రహ్మిక్యము పొందిన పిదప బ్రహ్మమానస
పుత్రుదగుతచే బ్రాహ్మణుఇది మహాభాగత రచనకు వ్యాసుని ఉద్యుక్తుని చేస్తూ నారదుడు
తనను గూర్చి చెప్పిన వృత్తాంతము. మహా భారత సభాపర్వంలో నారదుని గురించి ఇలా
చెప్పబడింది - ఇతడు వేదోపనిషత్తులను, పురాణాలను బాగా తెలిసినవాడు. దేవతలచే పూజితుడు.
కల్పాతీత విశేషాలనెఱిగినవాడు. న్యాయ ధర్మ తత్వజ్ఞుడు. శిక్షా కల్ప వ్యాకరణాలు
తెలిసినవారిలో శ్రేష్టుడు. పరస్పర విరుద్ధములైన వివిధ విధి వాక్యాలను సమన్వయపరచగల
నీతిజ్ఞుడు. గొప్ప వక్త, మేధావి. జ్ఞాని, కవి, మంచి చెడులను వేరు వేరుగా గుర్తించుటలో నిపుణుడు.
ప్రమాణముల ద్వారా వస్తు తత్వమును నిర్ణయించుటలో శక్తిశాలి. న్యాయవాక్యముల
గుణదోషముల నెఱిగినవాడు. బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల
ప్రతిభాశాలి. ధర్మార్ధకామమోక్షముల యధార్ధ తత్వమునెరిగినవాడు. సమస్త
బ్రహ్మాండములయందును, ముల్లోకములయందును జరుగు సంఘటనలను తన యోగబలముచే
దర్శింపగలడు. సాంఖ్యయోగ విభాగములు తెలిసినవాడు. దేవ దానవులకు వైరాగ్యమును
ఉపదేశించుటలో చతురుడు. సంధి విగ్రహ తత్వములు తెలిసినవాడు. కర్వ్య, అకర్తవ్య విభాగము చేయగల దక్షుడు. రాజనీతికి
సంబంధించిన ఆరు గుణములలో కుశలుడు. సకల శాస్త్ర ప్రవీణుడు. యుద్ధ విద్యా నిపుణుడు.
సంగీత విశారదుడు. భగవద్భక్తుడు. విద్యాగుణనిధి. సదాచారములకు ఆధారమైనవాడు. లోక
హితకారి. సర్వత్ర సంచరింపగలవాడు. పైన తెలిపిన ప్రశ్నలకు వరుసగా ఈ దిగువన
జవాబులివ్వబడినవి.మిగిలినది శంబూకుడు 10 లో.....
శంబూకుడు – 10
1. త్రేతాయుగ ధర్మమూ ప్రకారము శూద్రుడు తపస్సుకు
అర్హుడు కాదు. అతడు ‘యమ’ నియమముల పాటించలేదు. బొందెతో
స్వర్గము చేరవలెనన్న స్వార్థపరుడు. అందుకే రాజయిన రామునిచే తగిన శిక్షను
అనుభావిన్చికోడా అవతారమూర్తి చేతులలో స్వర్గస్తుడగుటతచే స్వర్గమును పొందినాడు.
రామాయణములో బ్రాహ్మణ బాలునికి సంబంధించిన ఉదంతము తప్ప
ధర్మ జిజ్ఞాసకు సంబంధించిన
చర్చ కానరాడు. శంబూకుడు తపస్సునారంభించిన కొలది
కాలమునకే ఈ సంఘటన సంభవించినది గా చ్చేప్పుకొనవచ్చును. అందుకే మనము ఒక అవాంతరమునే
రామాయణమున చూచుచున్నాము. లేకుంటే ఇటువంటి అధర్మ దృష్టాంతములను మనము పెక్కులుగా
చూసియుండేవారము.
1.
నారదుడు త్రిలోక సంచారియే గాక త్రికాలవేత్త, అందుకే ఆ మహనీయుడు ఆసమయమునకు అక్కడ
చేరినాడు.
2.
నారదుడు ఒక్కడే, వచ్చిన వారిలో బ్రహ్మర్షి.
మిగతావారందరూ భూలోకఋషులే! గత యుగాలలో పెద్దలను, ఉన్నతులను గౌరవించే సాంప్రదాయము
బలముగా ఉండేది.
3.
నారదుడు బ్రాహ్మడే అన్నది పైన విపులముగా
తెలియబరచినాను, దోషమును,
దోషిని గుర్తించి తగిన దండన విధించుట రాజగు శ్రీరామునిది.
4.
ఆ కాలములో ధర్మపాలనకు పెద్దపీట వేయబడినది, పైగా ఒక యోగ్యతా లేని వ్యక్తి
స్వర్గమునకు వచ్చుట, అతను చెప్పిన ప్రకారమూ స్వర్గమును
జయించుట అన్నవి దేవతలు హరించుకోవలసిన విషయములు కావు. ఒకవేళ ఆ ఆపదే సంభవించితే
తిరిగీ నారాయణునే ఆశ్రయిన్చావలెను కదా! ఆయన అవతారమే భూమిపై ఉన్నపుడు జరుగవలసిన పని
జరిగిపోతుంది కదా! ధర్మస్తాపనతో బాటు దేవతల సందిగ్ధము తీరి చిత్తశాంతి వారిలో
నెలకొన్నది కావుననే పుష్ప వృష్టి.
5.
దానిని బట్టే బొందెతో స్వర్గము చేరుట అసాధ్యమని
తెలియవచ్చుచున్నది, అసలు త్రిశంకువు అన్న క్షత్రియుడు, మరిశంబూకుదో? ఎవరయినా బొందె వదిలిన పిదపాయే
స్వర్గము.
6.
రాముడు ధర్మ నిగ్రహుడు, ధర్మ విగ్రహుడు. వివవారము తెలిపియే
విగతుని చేసినాడు. దేవా కార్యము ఏమిటి అన్నది పైన వివరించినాను.
మిగిలినది శంబూకుడు 11లో.......
శంబూకుడు గురించి మీ వివరణ వ్యాసము అమోఘమైనది.
ReplyDeleteరామ శబ్దము
నారాయణ, నమఃశివాయ అను శబ్దములనుండి యేర్పడిన విధమును రా, మ అను అక్షరముల గొప్ప ప్రత్యేకతను శక్తులనూ చాలా తార్కికంగా వివరించారు.
రామో విగ్రహవాన్ ధర్మః అను విషయమును బాగా వివరించేరు.
ఇంద్రజిత్తును వధించేటప్పుడు ముందుగా చదివిన
ధర్మాత్మా సత్య సంధశ్చ రామో
దాశరధీర్యది
పౌరుషేచ అప్రతిద్వన్దః
శారైనంజహి రావణిం!!
అను శ్లోకార్ధమును గొప్పగా వివరించేరు.
ఆ శ్లోక మహిమతో లక్ష్మణుడు వేసిన బాణానికి ఇంద్రజిత్తు మరణించడాన్ని వివరించేరు. ఇది యెంతో గొప్ప సమచారం.
ఆ తర్వాత
చతుర్వింశత్సహస్రాణి
శ్లోకనాముక్తవాన్ ఋషిః
ఎంతో వివరంగా విశ్లేషించేరు.
రామాయణంలో గల మొత్తం
ఉత్తర రామాయణంతో కలుపుకొని శ్లోకాలు24,253 అనీ మొత్తం ఏడు కాండలనీ,
అప్పుడు మాత్రమే
ప్రతివేయి శ్లోకాలకూ ఒక్కొక్క గాయత్రి మంత్రక్షర అమరిక సరిపోతుందని నిరూపిస్తూ అద్భుతమైన వివరణను యిచ్చేరు.
ఆఖరున శతశ్లోకీ రామాయణములోని మొదటి, చివర శ్లోకములను యిచ్చారు.
గాయత్రీ మంత్రమున ఆద్యంతాలు తెలిపి రామాయణానికి సీతారామ చరితము యొక్క గొప్ప పవిత్ర తకు అనుసంధాన అంశాలు వివరించేరు. ఎంతో జ్ఞానదాయకమైన మీ రామాయణ వ్యాస రచనకు
అభినందన శతమండీ రామ మోహన రావు గారూ.
మీకు అనేక ధన్యవాదములు... వందనములు🌹🙏🙏🙏🌹
మీ అపూర్వ అపురూప స్పందనకు ఆత్మా సాక్షిగా నమస్కరున్చుచున్నాను.మీ పాఠనాశక్తికి, పఠనాశక్తికి, పఠనాస క్తికి జోహార్లు.
Delete