రామాయణము - శ్రీరామ సార్వభౌముడు
రామాయణము - శ్రీరామ సార్వభౌముడు
https://ajaraamarasukthi.blogspot.com/2024/06/blog-post.html
ఇతిహాసం అంటే అవును ఇది యథాతథముగా జరిగినది అన్నఅర్థము అందరికీ తెలిసినదే! ఇటువంటి ఇతిహాసములు అనబడే కావ్యములు వాల్మీకి వ్యాస మహర్షులు రామాయణ భారత రూపములలో మనకు ఇచ్చినారు. అందులో ఎన్నో విషయాలు విశేషాలు ఉన్నాయి. ఒక అవగాహనా బద్ధమైన ఆలోచనతో చదివితే నేడు మనము చదివించే అనేక ఆంగ్ల మాధ్యమ పాఠశాల, కళాశాలల శిక్షణా విషయాలు ఎన్నో మనకు ఎదురౌతాయి. అవి అన్నీ కాక, క్రమశిక్షణ, నీతి, నిజాయితి, ధర్మవర్తన, అవ్యాజ అమలమౌ అభిమానము, ద్వేశారాహిత్యము మొదలగు ప్రవర్తనకు సంబంధించిన ప్రబోధములు ఎన్నో కానవస్తాయి. అవి ఈ క్రింది విధముగా ఉన్నాయి.
Human Anthropology -మానవ వికాస శాస్త్రము
Geography - భూగోళ శాస్త్రము
Human Geography - మానవ భూగోళ శాస్త్రము
Political Administration - రాజ్కనీతి శాస్త్రము
Military Administration - సైన్య నియంత్రణ శాస్త్రము
Defense Strategies - సైనిక వ్యూహా శాస్త్రము
Architecture - వాస్తు శాస్త్రము
Communication Engineering - ప్రసార శాస్త్రము
International Relations - అంతర్జాతీయ సంబంధములు, దౌత్య సంబంధములు
Trade Commerce and Industries – వర్తక వాణిజ్య పరిశ్రమ విభాగము
Human Relations – మానవీయ సంబంధములు
Astronomy – ఖగోళ శాస్త్రము
Astrology – జ్యోతిష్ శాస్త్రము
Aeronotics – వైమానిక శాస్త్రము
Medicine and Life Sciences – ఆయుర్వేదము
Forestry and Animal Husbendry – వన మరియు జంతు శాస్త్రము
Family Ethics – కుటుంబ విధానము
Marriage – వివాహ విధానము
Human Customs and Beliefs– మానవీయ సంప్రదాయాలు మరియు వలువలు
Town Planning and Village Administration – పట్టణ, గ్రామ వాస్తు మరయు నియంత్రణ
Diplomatic Relationships – దౌత్య సంబంధములు
Naval Administration – నౌకాయాన విధివిధానములు
Metallurgy – లోహశాస్త్రము
Sculpture Art and Architecture – శిల్ప మరియు నిర్మాణ శాస్త్రము
Mathematics - గణిత శాస్త్రము
External Affairs – విదేశీ వ్యవహారములు
Civil Administration – పౌర శాస్త్రము
Moral Science – నీతి శాస్త్రము
Science of Warfare = యుద్ధతంత్ర శాస్త్రము
Leadership qualities – నాయకత్వ లక్షణములు
నేను ఈ వ్యాసమును రామాయణమును ప్రాతిపాదికగా తీసుకొని వ్రాయుచున్నాను. సాధారనముగా ఎందఱో మహానుభావులు, పౌరాణికులు తాత్విక ఆద్యాత్మిక చిన్తనాయుక్తమగు విచారదారతో విశ్లేషించియుండవచ్చుగానీ ఒక సామాజిక, నైసర్గిక, శాస్త్రావగాహనా దృక్పథముతో విశ్లేషించిన వారు తక్కువగా ఉంటారని నా ఉద్దేశ్యము. ఆ దృష్టి కొణములో విశ్లేషించే సాధికారికత నాలో లేకున్నా, తెలిసిన లేక నా అవగాహనలో తెలుసుకోగలిగిన విషయములు పంచుకొను తలంపుతో నా పరిశీలనలను మీ ముందుంచుచున్నాను.
పైన నేను తెలిపిన అనేక విషయములు రామాయణములో ఉన్నవే! దీనిని బట్టి, ఇన్ని విషయములను కల్గిన రామాయణమును మనము చదువుటకు ఒక జీవితకాలము సరిపోతుందా అన్నది ఆలోచించవలసిన విషయము. భక్తి, యుక్తి, ముక్తి కలిగించే ఇట్టి మహాఇతిహాస సంయుక్తమగు కావ్యము వ్రాసిన వాల్మీకి మహర్షికి తగిన భక్తిగౌరవములను మనమిస్తున్నామా! అన్నది ఆత్మ విమర్శ చేసుకొనవలసిన విషయము. ఇటీవలి ఒక చలనచిత్రములో ఒక దుష్ట పాత్రధారి పేరు వాల్మీకి. కొందరు అనవచ్చు రాముని పేరు పెట్టుకొన్న రాక్షసులు నేడు మన రాజ్యములో లేరా! అని. దీనికి నేను చెప్పగలిగిన జవాబు ఏమిటంటే ‘చలనచిత్రము’ అన్నది ఒక ప్రశస్తికెక్కిన ప్రసార మాధ్యమము.
సాధారణముగా అందలి విషయములపై ఉన్న శ్రద్ధ రామాయణాదులపై ఉండదు. ఇటువంటి కారణము చేతనే చాలా మంది విద్యార్థులు ఇందిరా గాంధీని గాంధీ గారి కూతురిగా భావించుతారు. భర్తపేరుతో వివాహిత పేరును చెప్పుట సాంష్రదాయమనుకొంటే ‘ఇందిరా ఫెరోజ్’ అని తెలిపియుండి ఉంటే ఎటువంటి అపోహకు తావు ఉండియుండదు కదా! రాబోయే కాలములో ‘వాల్మీకి’ అంటే ఫలానా కథానాయకుని తండ్రి, చాలా దుర్మార్గుడు అన్న ఒక ప్రథ ఏర్పడవచ్చు. అందుచే ఆయా పాత్రలకు పురాణములకు సంబంధించిన పేర్లు పెట్టేవిధముగా ఉంటే దుష్ట పాత్రల పేర్లు యధాతథముగా పెట్టుకొనవచ్చును.
ఇక మన రాజ్య పాలనా వ్యవస్థను గూర్చి టూకీకగా తెలుసుకొనే ప్రయత్నము చేస్తాను.
జనపదము అనగా కొన్ని గ్రామాలు, కొన్ని ప్రాంతాల కలయిక. దానికి ఒక ఏలిక.
అతనిని సామంతుడు అనేవారు. కొంతమంది సామంతులకు ఏలిక రాజు. కొందరు రాజులకు ఏలిక మహారాజు. అట్టి మహారాజులను జయించి తన కీర్తి పతాకమును ఎగురవేసిన ఆతడు చక్రవర్తి. యీతని పరిధిలో ఒక 10 శాతము లేక 15 శాతము భూమండలము ఉండనోపును. అంటే ఇటువంటి కొందరు చక్రవర్తులను తన ఎలుబడిలోవుంచుకొన్నవాడు సామ్రాట్టు. భూగోళమంతా కలిపితే ఒక 15 నుండి 20 మంది సామ్రాట్లు ఉండవచ్చును. అట్టి సామ్రాట్టులను జయించి ఏకఛత్రాధిపత్యమును చాటుకొన్నవాడు సార్వభౌముడు.
ఈ సమస్త భూమండలమును 7 ద్వీపములు గానూ, మన భారతము జమ్బూద్వీపములో ఉన్నట్లుగానూ మన పూర్వులు తెలియబరచినారు. ఈ జంబూద్వీపమును నవ వర్షములుగా విభజించినారు. ఆయా పేర్లు ఈ దిగువన ఇవ్వబడినవి.
సప్తద్వీపాలు: జంబూ , ప్లక్ష , శాల్మలీ , కుశ , క్రౌంచ, శాక , పుష్కర ద్వీపాలు.
జంబూద్వీపములోని 9 ఖండములు ఇవి:
1.భరత 2.కింపురుష 3.హరి 4.కురు 5.హిరణ్యక 6.రమ్యక 7.భద్రాశ్వ 8.ఇలావృత 9.కేతుమల.
ఇది కొన్ని యుగముల క్రిందటి మాట. ఇప్పుడు ప్రపంచము యొక్క నైసర్గిక స్వరూపము మారిపోయింది.
ఈ నాడు ఐక్యరాజ్య సమితిచే గుర్తింపబడిన దేశములు నాకు తెలిసి, 195. శ్రీరామచంద్రుని కాలములో ఈ రాజ్యముల సంఖ్య చాలా ఎక్కువ. మనకు స్వాతంత్రము వచ్చిన వెంటనే బ్రిటీషు వారు మనలను వదిలి వెళ్ళే సమయమునకు ఉన్న రాజ్యాలు ఇంచుమించు 695. పాకిస్తాన్ బాంగ్లా దేశ్ లోని రాజ్యములు పోగా మిగిలినవి ఇంచుమించు 650. ఈ రాజ్యములన్నీ భారతదేశములో విలీనము చేసిన గొప్పదనము సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారికి చెందుతుంది. ఈ విధముగా ఆలోచించినపుడు మొత్తము భూగోళములో రామాయణ కాలము నాటికి ఎన్ని ఉండవచ్చును అన్నది మన ఊహకు అందదు. కొందరు అసమగ్ర విశ్లేషకులు చెప్పు రీతిగా రామాయణ కాలములో అరణ్య సంస్కృతి కాక, ఎంతో నాగరీకత విలసిల్లేదని పరిశీలనాత్మకముగా చదివితే మనము తెలుసుకొనవచ్చును. కావున, ఆ రాజ్యములన్నీ ఆయన ఏలుబడిలో ఉండినాయి అంటే ఆయన ఎంతటి వీరుడో, ధీరుడో, శూరుడో ఒక్కసారి ఆలోచించండి.
సార్వభౌముడు అంటే సమస్త భూమండలమునూ తన ఏలుబడిలో కలిగినవాడు. అట్టి మహాపురుషుడు ఒకడే! ఆయనే దశరథాత్మజుడగు శ్రీరామ చంద్రుడు. 'నావిష్ణుర్పృథ్వీపతిః' అన్న ఆర్యవాక్యమునకు అర్థ సమన్వయము కలిగినవాడు. పృథివిని అంతటినీ పాలించగలిగినవాడు మాత్రమె విష్ణువు. మరి రాముడు విష్ణువే కదా!
ఇక కోసలను గూర్చి తెలుసుకొందాము. ఆపనిని మరోమారు చేద్దాము.........
రామాయణము - శ్రీరామ సార్వభౌముడు-2
కోసలను వాల్మీకి ఏమన్నాడో ఒకపరి పరికించుదాము
బాల కాండ లోని 5 వ సర్గలోని 5వ శ్లోకముద్వారా మనకు ఈ విధముగా తెలియవస్తూవున్నది.
కోసలో నామ ముదితః స్ఫీతో జనపదో మహాన్ |
నివిష్ఠః సరయూతీరే ప్రభూత ధనధాన్యవాన్ ||
అయోధ్యానామ నగరీ తత్రాస్సీల్లోకవిశ్రుతా |
మనునా మానవేంద్రేణ యా పురీ నిర్మితా స్వయం ||
అయతా దశ చ ద్వే చ యోజనాని మహాపురీ |
శ్రీమతీ త్రీణివిస్తీర్ణా సు విభక్తమహాపథా ||
సరయూనదీతీరములో కోసల అను పేరుగల ఒక మహా జనపదము కలదు. అది ధనధాన్యములతో సంతుష్ఠులైన జనులతో కలదు. ఆ జనపదములో లోక ప్రసిద్దమైన అయోధ్యా నగరము కలదు. దానిని మానవేంద్రుడైన మనువు స్వయముగా నిర్మించినాడు. ఆ నగరము పన్నెండు యోజనముల పొడవు మూడు యోజనముల వెడల్పు గలగి మిక్కిలి విశాలముగా మహావీధులతో విలసిల్లు చున్నది.
ఇక్కడ ఒకమాట చెప్పుకొనవలసి వస్తుంది.
సముద్రమట్టమునకు కొంత ఎత్తున ఉండి ఇంచుమించు సమతలంగా ఉన్న ప్రాంతాన్ని పీఠభూమి అని వ్యవహరిస్తారు. ఈ విధమగు పీఠభూమిపై ఏర్పడినది అయోధ్యానగారము. నగరము అన్న పేరుగలిగిన ప్రాంతములకు సముద్రము దగ్గరగా ఉండదు. నగరమునకు మహాపురము అన్న మరొకపేరు ఉన్నది. ఉదాహరణమునకు హైదరాబాదు, బంగళూరు, దిల్లీ మొదలగునవి నగరములుగాగానీ మహానగరములుగానీ పిలువబడుతాయి. పూర్వము ఇట్టి నగరమును రాజధానిగా చేసుకొని రాజులు తమ ఏలుబడిలో ఉన్న ప్రాంతమును పాలించేవారు. ఆ ప్రాంతమును రాజ్యమని, ఆ ఏలికను రాజు అని అంటారు. ఈ నగరాన్మికి కట్టుదిట్టమైన కాపలా, నగరము చుట్టూ ప్రహరీలు, ప్రవేశ ద్వారములు ఈవిధముగా ఎన్నో కట్టుదిట్టాలు కలిగి ఉంటాయి.
అదే సముద్ర తీరములో ఉండే అతిపెద్ద ఊర్లను పట్టణములు అంటారు. ఉదాహరణము చెన్నపట్టణము, మచిలీ పట్టణము, విశాఖ పట్టణము, భీముని పట్టణము, కళింగ పట్టణము,నాగ పట్టణము, మొదలగునవి. అదేవిధముగా పల్లెలు, గ్రామములు, ఊర్లు, పేటలు, పురములు, ప్రోళ్ళు ( భట్టి ప్రోలు, అమ్మన ప్రోలు....), ఓళ్ళు (బిక్కవోలు, ఒంగోలు, కందెన ఓలు అంటే కర్నూలు,......) ఈవిధముగా జనాభాను బట్టి వనరులను బట్టి, వసతులను బట్టి వర్గీకరించినారు. ఎన్నో యుగాలకు ముందే! రామాయణమును ఈ విధముగా తార్కికమైన వాస్తవ దృష్టితో పరిశీలించితే మనకు తెలియవస్తుంది, రామాయణము చరిత్రే అని.
రామో రాజ్యముపాసిత్వా
‘రామో రాజ్యముపాసిత్వా’ అంటే రాముడు రాజ్యమును ఉపవసించినాడు, ఉపాసన చేసినాడు ఉపాసించినాడు అని అర్థము. నిజానికి దీనిని ‘ధ్యేయ వాక్యము’ అంటారు. ఈ ఉపాసన అన్న మాటను దైవధ్యానములో కదా ఉపయోగించుతాము, రాజ్యమును ఉపాసించుట ఏమిటి అన్నది మన మొదటి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబును పొందుటకు ముందు అసలు ఉపాసన అంటే ఏమిటో మనము తెలుసుకోవాలి.
ఉపాసన
ఉపాసన అన్న మాటకు అసలు అర్థమే అతి సమీపమున కూర్చొనుట. ఇది ఒక భార్యా భర్తల అనుబంధము. ఉపాసకుడు భార్య. ఉపాసితుడు భర్త. ఒక చిన్న మాట చెబుతాను. మంట అన్నది వెలుగు. అది లేకుంటే చెంతనే ఉన్న సమిధ కనిపించదు. కానీ ఆ సమిధ మంటను చేరితే అది కూడా జ్వాల లేక మంట అయిపోతుంది. అప్పుడు చీకటి అన్న ప్రశ్నఉదయించదు. మన ధ్యేయము అది. ఆ ధ్యేయమును సాధించిన వాడు శ్రీరామచంద్రుడు.
తిరిగీ అసలు విషయమునకు వద్దాము.
నారదుడు వాల్మీకి మహర్షి వద్దకు వచ్చి రామాయణ రచనకు గడంగుమని పురికొల్పుటలో భాగముగా విష్ణుని వద్దకు వెళ్లి దేవతలు విన్నవించుకొనగా రాముడు వారికి చెప్పిన మాటను నారదుడు వాల్మీకికి చెబుతున్నాడు. రామాయణములోని బాలకాండము మనకు రామ కథ సంక్షిప్తముగా నారదుని ద్వారా వాల్మీకి మహర్షితో బాటూ మనకు కూడా తెలియవస్తుంది. అందులో భాగముగా ఈ రెండు శ్లోకములను చూడండి.
రాజ వంశాన్ శత గుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్ వర్ణ్యం చ లోకే అస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి |1-1-96|
దశ వర్ష సహస్రాణి దశ వర్ష శతాని చ |
రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మ లోకం ప్రయాస్యతి |1-1-97|
రాఘవుడు క్షత్రియవంశములను నూరురెట్లు వృద్థిపఱచును. ఇక్కడ మనము గుర్తు తెచ్చుకోనవలసిన విషయము ఒకటుంది. శ్రీరాముడు రాజగుటకు పూర్వమే పరశురాముడు భూమండలములోని రాజులనందరినీ విచాక్షణారహితముగా మట్టు పెట్టినాడు. మరి ఈ సంపూర్ణ భూమండలము పై తిరిగీ రాజులను పునఃప్రతిష్ఠించ వలసిన అవసరము సార్వభౌమునికి ఉన్నది కదా! అందుచేత అంతటి బృహత్కార్యమును చేపట్టినాడు శ్రీరాముడు.
ఇక పోతే, నాలుగు వర్ణములవారిని ఈ లోకమున తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. ఆ ప్రభువు పదునొకండువేల సంవత్సరములకాలము ప్రజానురంజకముగా పరిపాలన సాగించి, అనంతరము వైకుంఠమునకు చేరును. [1-1-96, 97]
ఇప్పుడు మొదటి శ్లోకమును కొంత విశ్లేషించుకొందాము. రాముడు సార్వభౌముడు అని మనము మొదటనే నిర్దారించుకొన్నాము. తానూ పరమాత్మ అని ఆయనకు గుర్తులేదు మానవునిగానే వ్యవహరించినాడు అని అనుకొన్నా, ఆ దైవత్వము ఆయనను విడువడుకదా! అందుకే ఆయన ఎన్నో ఎన్నేన్నో సంస్కరణలు చేసి రాజ్యపాలనాను సుప్రతిష్ఠితము చేసినాడు. తన తరువాత రాజ్యమును, తనయొక్క, తన తమ్ముల యొక్కకొడుకుల నడుమ పంపకాలు కూడా జరిగిపోయినాయి. అంటే శ్రీరామ చంద్రుని తరువాత చతుస్సాగరవలయిత నవఖండ మండలమును పరిపాలించిన సార్వభౌముడు మనకు చరిత్రలో కనిపించడు.
రాజవంశాన్ శతగుణాన్ - స్థాపయిష్యతి రాఘవ: |
చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ - స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||
భావం : రాముడీ లోకమందు రాజవంశములను నూఱింతలు అభివృద్ధి పరచును. నాల్గు వర్ణములను వారి వారి ధర్మములందే పరివర్తించునట్లు చేయగలుగును. ఈ విషయమును గూర్చి తగు సందర్భమున తెలియజేస్తాను.
మరి తన లక్ష్యమును గూర్చి రాముడు చెప్పినట్లు నారదుడు చెప్పినాడు. ఇదేవిషయమును 5వ సర్గలో రాముడే నేరుగా దేవతలకు చెప్పినట్లు కూడా మనము బాలకాండ 5 వ సర్గలో చూస్తాము. దీనిని బట్టి మనకు రామచంద్రుడు 11,000 సంవత్సరములు భూమిని పాలించినట్లు తెలియవస్తూవుంది. ఈ మాట వింటూనే మనలో ఉదయించే అనుమానము మనిషి బ్రతికేది 100 సంవత్సరములైతే 11,000 బ్రతకడము అన్నది అతిశయోక్తి కాదా!
మిగిలినది మరొకసారి.........
కృతజ్ఞతలు
ReplyDelete