ఆరోగ్యము
ఆరోగ్యము
https://ajaraamarasukthi.blogspot.com/2024/01/blog-post_26.html
పరచింతనమ్ము తోడుత
పరిపాటిగ ధృడ శరీర పాలకుడౌచున్
ఆరోగ్య వంతుడగుచో
అరమరికలు లేక శివుని అండన చేరున్
వ్యాయామాత్ లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖం ।
ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం ॥
వ్యాయామము వలన ఆరోగ్యము చేకూరును. దీర్ఘాయుష్షు, బలము, సుఖము కలుగును. ఆరోగ్యమే మహా భాగ్యము. స్వాస్థ్యము సర్వార్థాలకి సాధనము.
ఆరోగ్యం రెండు రకాలు. శారీరక ఆరోగ్యము. మానసిక ఆరోగ్యము. మనిషి శరీరానికి ప్రతినిత్యము క్రమ శిక్షణతో కూడిన వ్యాయామము అత్యంత ఆవశ్యకము. నిత్య వ్యాయామము వలన శరీర భాగాలు అన్నిటీకీ సరియైన రక్త ప్రసరణము జరిగి శరీరమంతయూ అరోగ్యముతో తొణికిసలాడుతూ ఉంటుంది. యోగము మరియూ నిశ్చల ధ్యానములాంటి ప్రక్రియల ద్వారా మానసిక ఆరోగ్యము చేకూరుతుంది. తద్వారా బుధ్ధి కుశలత పెరుగుతుంది. దీర్ఘ ఆయుర్దాయం చేకూరుతుంది. శరీర అవయవాలకి తగినంత బలం చేకూరుతుంది. నిరాశా నిస్పృహలను దరి జేరనీయదు.పైగా అది సుఖాన్ని కలుగజేస్తుంది.
ఆధునిక ప్రపంచములో జీవన సరళి మారిన దృష్ట్యా, సేంద్రియ వ్యవసాయమును మానేసి అనేక రకములైన కృత్రిమఎరువులతో పండించిన పంటల ద్వారా, మనము అను నిత్యమూ తిని తద్వారా మనకు తెలియకుండానే మన ఆరోగ్యములను క్షీణింపజేసుకొంటున్నాము. దీనికి తోడు వ్యాపారులు తమ లాభార్జనయే ధ్యేయముగా మనిషి తినగలిగే ప్రతీ వస్తువులోనూ కృత్రిమ పద్ధతుల ద్వారా ప్రత్యామ్నాయాలను జోడించి హానికరమైన కల్తీలు కలిపి మనిషి అరోగ్యమును మరింత దిగాజార్చుచ్గున్నారు. ఆవిధముగా అనేకమైన రోగాల బారిన పడుతున్నారు. మధుమేహము లాంటి వ్యాధులు చిన్న వయసులోనే సంక్రమిస్తున్నాయి.
ఇటువంటి నేపధ్యములో, ప్రకృతి సిద్ధమైన వనరులతో పెరిగిన ఆహార పదార్థాలను తినడం, ప్రతి నిత్యమూ వ్యాయామము, నడక – ముఖ్యంగా స్వేదం కలిగేట్టుగా త్వరిత గతి నడక అనేది తప్పనిసరి అయ్యింది. వైద్యులు నిరంతరమూ దీనిని బోధిస్తున్నారు.
చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణలో మంచి విలువలు, సాంప్రదాయాలతో జీవితం గడపడం వలన మానసిక ఆరోగ్యానికి తద్వారా బుద్ధి కుశలతకి దోహదపడుతుంది.
ఆరోగ్యమే మహా భాగ్యము. మంచి శారీరక ఆరోగ్యము వలన, చక్కటి మానసిక ఆరోగ్యము వలన బుధ్ధి కుశలత పెరిగి మంచి ఆలోచనలు కలిగి అవి అన్నియునూ కార్య దీక్షకి, కార్య సాఫల్యతకీ దోహదం చేస్తాయి. మనిషికి ఉండే చక్కటి శారీరక మానసిక అరోగ్యములు సర్వార్థలను సాధించగలిగే సాధనం.
స్వామి వివేకానందుల వారు మన ఆర్ష ధర్మాలని గురించి, హిందూ మత గొప్ప తనాన్ని గురించి ఎంతో గొప్పగా మొత్తం ప్రపంచానికి తెలియ చెప్పి, దానికంటే ముందుగా, ఆరోగ్యము యొక్క ప్రాముఖ్యతని గమనించిన అతను శరీర ఆరోగ్యాము గురించి ఎక్కువగా తెలియ చెప్పేవారు శిష్యులకు. అందరినీ కర్ర సాము చేయమనే వారు. తనతో పోటీగా కర్ర సాముకనకు ఆహ్వానించే వారు.
వయోభేదంతో పని లేకుండా, ఆడవారు, మగవారూ అనే భేదం లేకుండా అందరూ వ్యాయామము తప్పక చేయవలసిన అవసరాన్ని ఈసుభాషితము తెలియ చేస్తూ ఉన్నది.
స్వస్తి.
వ్యాయామము వలన ఆరోగ్యముగా జీవించాలి మును బోధను చేసే శ్లోకమును, తదనుగుణంగా మీరు రచించిన పద్యమును అందించేరు.
ReplyDeleteఒక వ్యాసమును రచించి వ్యాయామము ద్వారా ఆరోగ్యమును యెలా అభివృద్ధి పరుచుకోవచ్చునో తెలుపుతూ నేటి పాడి పంటలు,ఆహారం కల్తీలేని వాటివలన కలుగు నష్టాలను చక్కగా వివరించారు.ఆరోగ్య సంరక్షణకు ఎంతో ఉపయోగ కరమైన పోస్టును అందించేరు...
యోగాభ్యాసం చేస్తున్నవారి చిత్రమును జత చేసేరు.
మీకు అనేక అభినందనలండీ రామ మోహన రావు గారూ...